భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): సింగరేణి బతకాలంటే బీఆర్ఎస్ గెలవాలని, కార్మికులు ఉద్యమస్ఫూర్తిని చాటి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును గెలుపును కాంక్షిస్తూ ఆదివారం ఆయన ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి జిల్లాకేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల్లో పోరాట స్ఫూర్తి ఉందని, చైతన్యవంతమైన నాయకత్వం ఉందన్నారు. అదే ఉద్యమ స్ఫూర్తితో కొత్తగూడెంలో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణిని మింగేయాలని చూస్తున్నదని, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం సంస్థను కాపాడుకుంటున్నదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే కార్మికులకు లాభాల్లో వాటా, దసరా, దీపావళి బోనస్ పెరిగిందన్నారు.
‘కొత్తగూడేనికి విమానాశ్రయాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తుంటే కేంద్రం ఆ ప్రయత్నానికి అడ్డుపుల్ల వేసింది. ప్రధాని మోదీ పనిగట్టుకుని మరీ మా ప్రయత్నాలను అడ్డుకున్నారు’.
కొత్తగూడేనికి విమానాశ్రయాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తుంటే కేంద్రం ఆ ప్రయత్నానికి అడ్డుపుల్ల వేసిందన్నారు. ప్రధాని మోదీ పనిగట్టుకుని తమ ప్రయత్నాలను అడ్డుకున్నారని ఆరోపించారు. కొత్తగూడెంలో చాలాకాలం నుంచి అంబాసత్రం భూముల సమస్య ఉందని, ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ సమస్యకు పరిష్కారంచూపిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రేగళ్ల ప్రాంతంలో కొందరికి పోడు పట్టాలు రాలేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని ప్రకటించారు. గిరిజనులతో పాటు కొందరు గిరిజనేతరులు కూడా పోడు చేసుకుంటున్నారని, వారికి పోడు పట్టాలు అందించేందుకు గిరిజన చట్టం అడ్డుగా ఉందని, సున్నితమైన విషయం కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకుని పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో డబ్బులు కట్టలు పట్టుకుని కొందరు ఓట్లు కొనుగోలు చేయడానికి వస్తారని, ప్రజలు వారి మాటలు నమ్మొద్దన్నారు. కొత్తగా బీఆర్ఎస్లో చేరిన కోనేరు చిన్ని, ఎడవల్లి కృష్ణ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రోడ్ షోలో బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కోనేరు చిన్ని, ఉద్యమకారులు పటేల్రావు, మానవతారాయ్, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ముఖ్యనేత ఎడవల్లి కృష్ణ, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీ శాంతి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ పాల్గొన్నారు.
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వనమా
‘కొత్తగూడెం అడ్డా.. వనమా అడ్డా’ అని ఇక్కడ గెలిచేది తానేనని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. తాను వార్డు మెంబర్ నుంచి మంత్రిగా ఎదిగానన్నారు. కొత్తగూడెం అభివృద్ధిలో తన కృషి ఎంతో ఉందన్నారు. కొందరు మాయమాటలు చెప్పి ఓట్లు అడుగుతారని, ప్రజలు వారి మాయలో పడొద్దన్నారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని, పార్టీ హ్యాట్రిక్ విజయం ఖాయమన్నారు.
మంత్రి కేటీఆర్‌ను చూసేందుకు వందలాది మంది అభిమానులు రోడ్డు పక్కన వేచి ఉన్నారు. ఆయన జిల్లాకేంద్రంలోని త్రీటౌన్ సెంటర్‌కు చేరుకోగానే ఆ ప్రాంతం జన సంద్రమైంది. ఆయన ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. బస్టాండ్ సెంటర్ నుంచి గణేష్ టెంపుల్ వరకు జన సందోహం కనిపించింది. డప్పు వాద్యాలకు పార్టీ నేతలు నృత్యం చేస్తూ సందడి చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థి వనమా కూడా వారితో కలిసి కాలు కదిపారు.