ఖమ్మం, మే 28 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి గెలుపు ఖాయమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ధీమా వ్యక్తం చేశారు. పలు సంస్థల సర్వేల్లోనూ, తమ పార్టీ శ్రేణుల రిపోర్టుల్లోనూ ఇదే విషయం వెల్లడవుతోందని అన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒకరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని అన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్షతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగించిన అభివృద్ధి చిహ్నాలను మాత్రమే మార్చగలరు గానీ తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ పొందిన సుస్థిరమైన స్థానాన్ని చెరపడం ఎవరితరమూ కాదని స్పష్టం చేశారు. పట్టభద్రుల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కృషి చేసిన కలెక్టర్లు సహా ఇతర అధికారులందరికీ అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. అలాగే, పార్టీ అభ్యర్థిగా రాకేశ్‌రెడ్డిని బలపర్చిన పార్టీ అధినేత కేసీఆర్‌కు, ప్రచారంలో పాల్గొని శ్రేణుల్లో ఉత్తేజం నింపిన పార్టీ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్ తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఘన విజయం సాధించబోతున్నట్లు ఇప్పటికే తేలిపోయిందని అన్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నామని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరితరమూ కాదని స్పష్టం చేశారు. ఉద్యమనేత ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. రైఫిల్రెడ్డిగా మారారని విమర్శించారు.
ఈనాడు ఇంతలా ఊగిపోతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏమిటో చెప్పాలని వద్దిరాజు, మధు డిమాండ్ చేశారు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎకుపెట్టిన రైఫిల్‌రెడ్డి చరిత్ర తెలంగాణ బిడ్డలందరికీ తెలిసిందేనని అన్నారు. తెలంగాణ చరిత్ర నుంచి కాకతీయులను, నవాబులను ఎవరూ చెరిపేయలేరని అన్నారు. తెలంగాణలో గొలుసుకట్టు చెరువుల ఫలాలను నేడు మనమందరమూ పొందుతున్నామంటే అది కాకతీయులకు గొప్పదనం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణను తమదైన స్థాయిలో అభివృద్ధి చేసిన గొప్పదనం కూడా నవాబులకు ఉందని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో కేసీఆర్ చరిత్ర సుస్థిరంగా ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు బెల్లం వేణు, ఉప్పల వెంకటరమణ, తాజుద్దీన్, బిచ్చాల తిరుమలరావు, లకావత్ గిరిబాబునాయక్, డోకుపర్తి సుబ్బారావు, శీలంశెట్టి వీరభద్రం, నరేందర్, మందడపు శంకర్ తదితరులు పాల్గొన్నారు.