వైరా టౌన్/ కొణిజర్ల, ఆగస్టు 25: అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తనకు శ్రీరామరక్షగా నిలుస్తాయని అన్నారు. త్వరలోనే వైరా నియోజకవర్గస్థాయి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థిగా మదనలాల్ పేరును పార్టీ అధినేత కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలో శుక్రవారం తొలిసారిగా వైరాకు చేరుకున్న మదన్‌లాల్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. వందలాది వాహనాలతో వెంకటాయపాలెం నుంచి వైరా వరకూ ఆయన ర్యాలీగా వచ్చారు. వైరా శివారు నుంచి పట్టణంలోని రింగ్ సెంటర్ వరకూ రోడ్‌షోగా వచ్చారు. అక్కడ ఆయన వాహనం దిగి వైరా నేలతల్లిని ముద్దాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అందిస్తానని, అందరి ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలనూ కలుపుకొని పయనిస్తానని అన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యే రాములునాయక్ బావను ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరానని, ఆయన పార్టీ శ్రేణులను పంపించారని అన్నారు. పార్టీ బలోపేతం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇద్దరమూ కలిసి పనిచేస్తామని అన్నారు. ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత కేసీఆర్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందిస్తామని, పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పావని, కనకదుర్గ, కవిత, కృష్ణార్జున్‌రావు, సీతారాములు, సునీత, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, సురేశ్, సతీశ్, జగన్, చిరంజీవి, ఏలూరి శ్రీనివాసరావు, పోట్ల శ్రీనివాసరావు, బ్రహ్మం, వెంకటేశ్వర్లు, కిరణ్, రవి, రామారావు, మల్లేశ్, మోహన్‌రావు, నర్సయ్య, శ్రీను, శివ, దాదాసాహెబ్, మీటు, జవహర్లాల్, వెంకటేశ్వరరావు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.