ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పరిమళాలు గుబాళిస్తున్నాయి. గులాబీ సైనికులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. మరో 24 గంటల్లో ఉమ్మడి జిల్లా గులాబీమయం కానుంది. వేలాది మంది గులాబీ సైన్యం వరంగల్ సభకు కదిలివెళ్లే పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఒకచేతిలో గులాబీ జెండా, మరో చేతిలో చద్దిమూట పట్టుకొని ఎల్కతుర్తికి బయలుదేరేందుకు సిద్ధమై ఉన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నారు.
-ఖమ్మం, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
2001, ఏప్రిల్ 27న ఉద్యమసారథి కేసీఆర్ నేతృత్వంలో పురుడుపోసుకున్న టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) నేటితో 24 ఏళ్ల యవ్వన దశను దాటుతోంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కనీవినీ ఎరుగని పోరాటాలను నిర్మించి చుక్క రక్తాన్ని కూడా చిందకుండా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న బీఆర్ఎస్.. తెలంగాణ తెచ్చుకొని రెండు పర్యాయాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
25వ పుట్టిన రోజు వేడుకలను ఉద్యమాలకు ఊపిరిలాంటి వరంగల్ గడ్డపై నిర్వహించేందుకు పార్టీ అధినాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ గ్రామస్థాయి కార్యకర్త నుంచి అగ్రనేతల వరకూ అందరూ ఈ సభ విజయవంతం చేయడానికి విశేష కృషి చేస్తున్నారు. ఉద్యమ ఘట్టాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల వంటి ఎన్నో అంశాలను రజతోత్సవంలో పార్టీ అధినాయకత్వం తమ ముందు ఉంచనుందని తెలంగాణ సమాజం భావిస్తోంది.
వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతీ గ్రామం నుంచి వేలాది మంది ప్రజలు కదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ప్రజలు, పార్టీ శ్రేణులు వెళ్లేందుకు నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బస్సులు, కార్లు, ఇతరత్రా వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఎండ తీవ్రత ఉన్నందున రక్షణ కోసం గొడుగులు, చల్లటి నీటి కోసం కూలింగ్ క్యాన్లు, భోజనం, పులిహోర, టిఫిన్ లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు.
క్రమపద్ధతిలో సభా స్థలికి చేరుకునేందుకు, వాహనాలను పార్కింగ్ చేసేందుకు రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. భద్రాద్రి జిల్లా పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాలతోపాటు ఇల్లెందు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల నుంచి వెళ్లే వాహనాలకు జోన్-1లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, మధిర, వైరా నియోజకవర్గాలతోపాటు ఇల్లెందు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల నుంచి వెళ్లే వాహనాలకు జోన్-2లో పార్కింగ్ ఏర్పాటు చేశారు.
రజతోత్సవ సభ విజయవంతానికి ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలందరూ విశేష కృషి చేస్తున్నారు. గ్రామగ్రామాన విస్తృతంగా ప్రచారం చేశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో విస్తృతంగా పర్యటించి సన్నాహక సమావేశాల్లో శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, బానోతు హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, బానోతు మదన్‌లాల్, చంద్రావతి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమావేశమై సూచనలు చేశారు.
ఇల్లెందు/ భద్రాచలం/ మణుగూరు టౌన్, ఏప్రిల్ 25: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27 జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభా స్థలిని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, మెచ్చా నాగేశ్వరరావు, భద్రాచలం నాయకులు మానే రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్‌లు తదితరులు శుక్రవారం పరిశీలించారు. ఆయా నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా బీఆర్ఎస్ శ్రేణులు, పార్టీ అభిమానులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసిన వాహనాల పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు.
రూట్ మ్యాప్‌ను పరిశీలించడంతోపాటు ఏర్పాట్లలో నిమగ్నమైన నాయకులకు పార్కింగ్ విషయమై పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ సభకు హాజరుకావాలని, కేసీఆర్ ప్రసంగాన్ని పూర్తిస్థాయిలో వినాలని కోరారు. బీఆర్ఎస్ నేతలు దిండిగాల రాజేందర్, లక్కినేని సురేందర్‌రావు, సిలివేరి సత్యనారాయణ, బొమ్మెర్ల వరప్రసాద్ గౌడ్, పరుచూరి వెంకటేశ్వరరావు, జాఫర్ హుస్సేన్, శీలం రమేష్, ఆకోజు సునీల్‌కుమార్, రేపాక పూర్ణచందర్రావు, కణితి రాముడు, ఎండీ జానీపాషా తదితరులు పాల్గొన్నారు.