ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 13 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారుల తీరుపై బీఆర్ఎస్, సీపీఎం పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. శుక్రవారం స్థానిక మేధా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్లో ఎన్నికల అధికారుల తీరు ప్రారంభం నుంచీ వివాదాస్పదంగా మారింది. కౌంటింగ్ ప్రారంభ సమయంలో జర్నలిస్టులను గేటు బయటనే ఉంచడంతో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసిన తరువాత మొదటిరౌండ్లో 15వార్డుల ఓట్ల లెక్కింపు చేపట్టారు. 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి చేతితో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 17ఓట్ల తేడాతో ఓటమి చెందడంతో కాంగ్రెస్ అభ్యర్థి విజ్ఞప్తి మేరకు రీకౌంటింగ్ చేపట్టగా మళ్లీ అదే ఫలితం వచ్చింది. 1వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి దుంపల నాగరాజు కాంగ్రెస్ అభ్యర్థి వరకుమార్ చేతిలో ఓటమి చెందాడు.
దీంతో రీకౌంటింగ్ చేపట్టాలని నాగరాజు కోరడంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున కౌంటింగ్ కేంద్రం గేట్ వద్దకు చేరుకొని అధికారుల తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. 1వ వార్డులో రీకౌంటింగ్ జరపాలని డిమాండ్ చేస్తూ దాదాపు 2గంటలపాటు నినాదాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. పోలీసులు భారీగా మోహరించి ఆందోళన చేస్తున్న వారిని కౌంటింగ్ కేంద్రంలోకి రాకుండా నిలవరించారు.