ఖమ్మం, మే 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లో హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 11:30 గంటలకు తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చేరుకుంటారు. మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దివంగత రాయల శేషగిరిరావు కాంస్య విగ్రహాన్ని కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.
అనంతరం మిట్టపల్లిలో జరిగే సభలో ప్రసంగించనున్నారు. తొలుత అంజనాపురం నుంచి మిట్టపల్లి సభా వేదిక వరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దివంగత రాయల శేషగిరిరావు విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేసేందుకు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. సభ ఏర్పాట్లను సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు గురువారం పరిశీలించారు.
జిల్లాలో కేటీఆర్ పర్యటించనుండడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొననున్నది. మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్‌రెడ్డి, మదన్‌లాల్, చంద్రావతి, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు తదితరులు పాల్గొననున్నారు.
కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయండి
ఖమ్మం/ సత్తుపల్లి, మే 8: తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో శుక్రవారం జరుగనున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని, సభకు భారీగా తరలిరావాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.
ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. మిట్టపల్లి గ్రామంలో ఉదయం 10 గంటలకు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు విగ్రహావిష్కరణ అనంతరం జరిగే బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించనున్నట్లు తెలిపారు. తొలుత అంజనాపురం నుంచి కొత్త మిట్టపల్లి వరకు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ ఉంటుందని, ఆ తర్వాత నిర్వహించనున్న సభకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావాలని వారు కోరారు.