ఇల్లెందు, ఏప్రిల్ 15 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27వ తేదీ జరుగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి ప్రతిఒక్కరూ కదలిరావాలి అని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
మంగళవారం ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అధ్యక్షతన ఇల్లెందు పట్టణంలోని జగదాంబ సెంటర్లో ఉన్న తెలంగాణతల్లి విగ్రహానికి పూలమాల వేసి పక్కన ఉన్న గోడపై రజతోత్సవ ప్రచార వాల్‌రైటింగ్‌ను ప్రారంభించారు. 7వ వార్డులో ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి మరీ ఎల్కతుర్తి సభకు రావాలని ఆహ్వానించారు.
అనంతరం భారీ ర్యాలీతో పాత బస్టాండ్ సెంటర్ వరకు చేరుకొని స్థానిక ఓ ఫంక్షన్ హాలులో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వద్దిరాజు, రేగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలలు అవుతున్నా ఒక్క పథకాన్ని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు.
రైతులు, ప్రజలను ఘోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పతనం బీఆర్ఎస్ రజతోత్సవ సభతో ప్రారంభమవుతుందని, సభకు వచ్చే జనాన్ని చూసి అధికార పార్టీ నాయకుల గుండెల్లో గుబులు పుట్టాలని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా విభాగ ప్రతినిధులను ఇబ్బందులు పెడుతున్న నాయకులు, అధికారుల కోసం ఒక పింక్‌బుక్ ఏర్పాటు చేశామని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వారిని క్షమించేదిలేదని హెచ్చరించారు.
రజతోత్సవ సభ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించిన నాయకులు అనంతరం బీఆర్ఎస్ నాయకుడు బానోత్ హరిసింగ్‌నాయక్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్, భూక్యా సంజయ్‌నాయక్, లక్కినేని సురేందర్‌రావు, ఆంగోతు బిందు, సిలివేరి సత్యనారాయణ, రంగనాథ్, జేకే శ్రీను, కటకం పద్మ, కటకంచి పద్మ, వాణి, మాధవి, పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు శీలం రమేష్, బొమ్మెర్ల వరప్రసాద్, తాతా గణేష్, హన్మంతురావు, పరుచూరి వెంకటేశ్వర్లు, ఖమ్మంపాటి రేణుక, నెమలి ధనలక్ష్మి, అబ్దుల్ నబీ, ఘాజి, జాఫర్ హుస్సేన్, కొక్కు సరిత, సోషల్ మీడియా ఇన్చార్జిలు సత్తాల హరికృష్ణ, కాసాని హరిప్రసాద్, గిన్నారపు రాజేష్, భావ్‌సింగ్, సురేష్, పోశం తదితరులు పాల్గొన్నారు.