ఖమ్మం సిటీ, జూన్ 30: రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని, కాంగ్రెస్ నాయకులు వారి వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ నేతలపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఖమ్మంరూరల్ బీఆర్ఎస్ నాయకుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. మంగళవారం ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం మండలాలకు చెందిన గులాబీ నేతలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఖమ్మం జిల్లాకు సీఎం రేవంత్ వస్తున్నారన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, రైతు సమస్యలపై మాట్లాడటం నేరమా అని ప్రశ్నించారు. విజ్ఞత ఉంటే ఆయన లేవనెత్తిన అంశాలపై చర్చించి సమాధానాలు చెప్పాలి కానీ, మంత్రి పొంగులేటి తన వద్ద చెంచాగిరి చేస్తున్న కొందరితో వ్యక్తిగత విమర్శలు చేయించడం ఏంటని నిలదీశారు. పూటకో పార్టీ మారిన హైబ్రీడ్ కాంగ్రెస్ నాయకులు అవాకులు చవాకులు పేలితే సహించేదిలేదని, చౌకబారు విమర్శలను వెంటనే మానుకోవాలని హెచ్చరించారు.
రైతులు పండించిన పంటల చివరి గింజ వరకు కొనుగోలు చేసిన ఘనత బీఆర్ఎస్ది అని, కాంగ్రెస్ పాలనలో మక్కలు అమ్ముకున్న రైతులకు ఇప్పటివరకు డబ్బులు జమకాలేదని తెలిపారు. కరువు ప్రాంతమైన పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కందాల ఉపేందర్‌రెడ్డి ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారని నాయకులు బాషబోయిన వీరన్న, ఉన్నం బ్రహ్మయ్య, వేముల వీరయ్య అన్నారు. రాజకీయాలకు అతీతంగా తమ నాయకుడు అన్ని వర్గాల ప్రజలకు సేవ చేశారని తెలిపారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. దమ్ముంటే పొంగులేటి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. మంత్రి వద్ద చెంచాగిరి చేస్తున్న మహిళా నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మరికొందరు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఉపేందర్‌రెడ్డి, యండపల్లి వరప్రసాద్, మరికంటి రేణుబాబు, చావా వేణుగోపాల్, మల్లీదు వెంకన్న, మంచానాయక్, ఉదయ్‌శంకర్ రాజు, దర్గయ్య, మహబూబ్అలీ, వెంపటి కృష్ణారావు, వెంకటేశ్వరరావు, సతీష్, నాగేశ్వరరావు, లక్ష్మణ్, రమేష్, రవి, రెడ్యానాయక్, వీరన్న, సైదిరెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.