Crime news : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మీరట్ జిల్లా (Meerut district) లో దారుణమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి అడ్డు తొలగించుకోవడానికి, భర్త పేరుమీద రూ.20 లక్షల బీమా సొమ్ము కాజేయడానికి ఓ భార్య ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ వేసి భర్తను మర్డర్ (Murder) చేసింది. అంతేగాక ఈ మరణాన్ని సహజమైన పాముకాటు (Snake bite) గా చిత్రీకరించేందుకు కుట్ర చేసింది. కానీ పోలీసులు ఆ కుట్రను చేధించారు. నిందితులైన మృతుడి భార్యను, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. హస్తినాపూర్‌లో నివసించే అతుల్ పన్వార్, అతని భార్య దామిని కలిసి ఒక ప్లే స్కూల్ నడుపుతున్నారు. ఈ క్రమంలో దామినికి ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ తుషార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తను వదిలించుకోవడానికి వీరు మొదట రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి చంపాలని చూశారు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ కావడంతో మరో భయంకరమైన ప్లాన్ వేశారు. గత గురువారం రాత్రి దామిని తన భర్త తాగే పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. అతుల్ స్పృహ కోల్పోయిన తర్వాత తుషార్ సాయంతో ఒక విషసర్పాన్ని తెచ్చి బెడ్‌పైకి వదిలి కరిపించారు.
శుక్రవారం ఉదయం అతుల్ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. తొలుత ఇది సాధారణ పాముకాటు మరణంగా భావించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చాయి. దాంతో రూరల్ ఎస్పీ అభిజీత్ కుమార్ నేతృత్వంలో రంగంలోకి దిగిన పోలీసులు.. దామిని, తుషార్ల మొబైల్ ఫోన్ రికార్డులను, లొకేషన్ డేటాను నిశితంగా పరిశీలించారు.
వారిద్దరి మధ్య ఉన్న సంబంధం, హత్య జరిగిన రాత్రి వారి కదలికలు బయటపడ్డాయి. పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితుడైన తుషార్‌కు ఇదివరకే పెళ్లయిందని, తన భార్యకు విడాకులు ఇచ్చి దామినితో కలిసి ఉండటానికే ఈ హత్యకు పాల్పడినట్లు తేలింది.