న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు సంప్రదాయంగా జరిగే అఖిలపక్ష సమావేశం నుంచి ప్రతిపక్షాలు కొంతసేపు వాకౌట్ చేశాయి. తృణమూల్ రెబెల్స్‌ను మీటింగ్‌కు ఆహ్వానించడంపై ప్రతిపక్షాల నేతలు మండిపడ్డారు. (Opposition Walk Out) టీఎంసీ అసమ్మతి ఎంపీల విలీనానికి అధికారిక ఆమోదం లభించకుండానే ఎన్న్సీపీఐని ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ స్థాపించిన టీఎంసీ పార్టీకి చెందిన సుమారు 20 మంది అసమ్మతి ఎంపీలు జూన్‌లో నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో విలీనమయ్యారు. అయితే గుర్తింపు, పార్లమెంట్ వెబ్సైట్లో పేరు కూడా లేని ఆ పార్టీని అఖిలపక్ష సమావేశానికి కేంద్రం ఆహ్వానించడం ఆందోళన కలిగించే విషయమని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ విమర్శించారు. ఎన్సీపీఐలో చేరిన ఆ 20 మంది అసమ్మతి ఎంపీల వివరాలను పార్లమెంట్ వెబ్సైట్ ఇప్పటికీ తృణమూల్ సభ్యులుగానే చూపిస్తోందని అన్నారు.
కాగా, స్పీకర్ వద్ద తుది నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉండగానే, 20 మంది టీఎంసీ రెబల్స్ ఎంపీలు విలీనమైన ఎన్సీపీఐని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించిన మోదీ ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ప్రతిపక్ష పార్టీలన్నీ కొన్ని నిమిషాల పాటు సమావేశం నుంచి వాకౌట్ చేశాయని రాజ్యసభలో ప్రతిపక్ష ఉప నాయకుడైన కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. ఎన్సీపీఐని కేంద్రం ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన ‘ప్రతీకాత్మక బహిష్కరణ’ అని ఆయన అభివర్ణించారు.
మరోవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. రామ మందిర విరాళాల కుంభకోణమే తమ అతిపెద్ద సమస్య అని కాంగ్రెస్ తెలిపింది. నీట్ పేపర్ లీక్, వ్యవసాయం, పెట్రోల్‌లో ఈ20 మిశ్రమం వంటి ఇతర సమస్యలు ఉన్నాయని పేర్కొంది. నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.