ఖమ్మం, మార్చి 21: రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శుక్రవారం శాసనమండలి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ‘అప్పులు ఘనం – అభివృద్ధి శూన్యం’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. ‘అప్పులు ఆకాశంలో – అభివృద్ధి పాతాళంలో’ అంటూ నినాదాలు చేశారు. ‘రూ.1.58 లక్షల కోట్ల అప్పు చేసి, ఎంతమంది మహిళలకు రూ.2,500 చొప్పున ఇచ్చారు?’ అని ప్రశ్నించారు.
‘ఇంత భారీగా అప్పు చేసి ఎంతమంది వృద్ధులకు రూ.4,000 పెన్షన్ అందించారు?, ఎంతమంది ఆడపిల్లలకు సూటీలు ఇచ్చారు?, ఎంతమందికి తులం బంగారం అందించారు?’ అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, తాతా మధు, సత్యవతి రాథోడ్, నవీన్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, చల్లా వెంకటరామిరెడ్డి, యాదవ్రెడ్డి, కోటిరెడ్డి పాల్గొన్నారు.