ఖమ్మం, మార్చి 17 : రాష్ట్రంలో మిర్చి ధరలు గణనీయంగా తగ్గడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సోమవారం హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆవరణలో మిర్చి దండలు మెడలో వేసుకొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వానకాలం సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగు కాగా.. ధర లేకపోవడంతో ఈ వానకాలం 2లక్షల 40వేల ఎకరాల విస్తీర్ణం తగ్గిందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మిర్చికి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.25 వేలు కల్పించి నాఫెడ్, మార్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. విదేశీ ఎగుమతికి చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహారపంటల జాబితాలో చేర్చాలన్నారు. మిర్చి రైతుల సమస్యలను వెంటనే పరిషరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ, ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, నవీన్‌కుమార్‌రెడ్డి, నవీన్‌కుమార్, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, యాదవ్రెడ్డి పాల్గొన్నారు.