ఖమ్మం, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్లో కొనసాగుతూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అధిష్ఠానం వేటు వేసింది. కొన్నిరోజులుగా ఆయన పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఓపికతో వేచి చూసిన అధినాయకత్వం.. ఆయన తీరులో మార్పు రాకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నది. కాగా, పొంగులేటిపై వేటు వేయడాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు స్వాగతిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి వ్యక్తిగత స్వార్థంతోనే సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నారని, ఆయనను ప్రజలు ఆదరించే పరిస్థితి లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని దుయ్యబట్టారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్నమొన్నటి వరకు బీఆర్ఎస్ నేత.. పార్టీ అధిష్ఠానం అయనకు సముచిత స్థానం కల్పించింది.. ఆయన సూచించిన వ్యక్తులకు పదవులు కట్టబెట్టింది.. బీఫాంలు ఇచ్చి ప్రజాప్రతినిధులను చేసింది.. పొంగులేటి పదవి అనుభవించినన్ని రోజులు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తారు.. గాడ్‌ఫాదర్‌గా అభివర్ణించారు.. ఎంపీగా పదవీకాలం పూర్తయిన తర్వాత ఏమైందో తెలియదు గానీ పార్టీ వెనుపోటు రాజకీయాలకు తెరతీశారు.. తన వర్గం వద్ద పార్టీ టిక్కెట్ ఇవ్వలేదనే అక్కసు వెళ్లగక్కుతూ కుట్రలకు పాల్పడుతున్నారు.. అంతేకాదు మరో ‘గజిని’లా మారి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి నాడు మహానేత అని పొగిడిన కేసీఆర్‌పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆదివారం కొత్తగూడెంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి తన వర్గంతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో స్థాయికి మించి కేసీఆర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలకు పాల్పడ్డారు. అభ్యంతర వ్యాఖ్యలు చేసి తన స్థాయిని తానే పాతాళానికి తొక్కేసుకున్నారు.
సిద్ధాంతం లేదు.. పార్టీ ప్రకటన లేదు..
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటివరకు తన రాజకీయ సిద్ధాంతం ఏమిటో ప్రజలకు వివరించలేదు.. పార్టీ పేరును ప్రకటించలేదు.. ఇలా జెండా.. ఎజెండా ఏమీ లేకుండానే ఉమ్మడి జిల్లాలోని పదికి పది నియోజకవర్గాలను కైవసం చేసుకుంటామని ప్రకటించడం ఆయన అపరిపక్వ రాజకీయ పరిణతికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘ఆలు లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం..’ అన్న చందంగా ఆయన వైఖరి ఉందని ఎద్దేవా చేస్తున్నారు. సమ్మేళనాలకు వచ్చే వారే లేక వెలవెలబోయి దర్శనమిస్తుండడం కూడా పొంగులేటికి కనువిప్పు కలుగకపోవ డం గమనార్హం. పరిస్థితి ఇలాగే కొనసాగితే పొంగులేటికి శంకరగిరి మాన్యాలు తప్పవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్ఠానం..
మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్ఠానం వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. వారిపై వేటు వేయడాన్ని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతించారు. నియోజకవర్గ కేంద్రాల్లో ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, రాములునాయక్, హరిప్రియానాయక్, కందాళ ఉపేందర్‌రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు విలేకర్ల సమావేశం నిర్వహించి పొంగులేటి వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు తప్పవని, పొంగులేటికి శంకరగిరి మాన్యాలు తప్పవన్నారు. పొంగులేటి వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. రాజకీయంగా ఆయన పతనం ప్రారంభమైందన్నారు.
శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు..
ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ బలమైన రాజకీయశక్తిగా ఎదిగిందన్నది వాస్తవం. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు, నాయకులను సిద్ధం చేసేందుకు ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నది. ప్రస్తుతం సమ్మేళనాలు ఉభయ జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయి. సమ్మేళనాల్లో మంత్రి అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త శేరి సుభాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రెండు జిల్లాల అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.