ఖమ్మం సిటీ, ఏప్రిల్ 8: కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరి దశాబ్ద కాలంపాటు ఉద్యమ నాయకుడి సారథ్యంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ప్రజలకు అమూల్యమైన సేవలు అందించానని, అదే స్పూర్తితో ఈ నెల 19న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. ఖమ్మంలోని తన నివాసంలో బుధవారం జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా స్వరాష్ర్టాన్ని సాధించిన మహా నేత మాజీ సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
అలాంటి నాయకుడి సారథ్యంలో తాను సుధీర్ఘంగా పని చేయడం అదృష్టమన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న జరుపతలపెట్టిన తన పుట్టిన రోజు వేడుకలు ఉమ్మడి జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల ఐక్యతకు దోహదపడాలనే లక్ష్యంతో ఖమ్మంలో ‘మినీ ప్లీనరీ’ నిర్వహణకు శ్రీకారం చుట్టామన్నారు. మమత ఆసుపత్రి ప్రాంగణంలోని ఫుట్‌బాల్ స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు జరుగనున్న ప్లీనరీకి ముఖ్య అతిథిగా అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు హాజరవుతారని తెలిపారు. వేడుకలకు తెలంగాణ కవులు, కళాకారులు సైతం వస్తారని, వారి ఆటాపాటలతో మినీ ప్లీనరీ వేడుకలు హోరెత్తనున్నాయని వివరించారు. రఘునాథపాలెం మండలానికి చెందిన సర్పంచ్‌లు, స్వల్ప మెజార్టీతో ఓడిన వారు, ఇతర కీలక నేతలంతా జన సమీకరణపై దృష్టి సారించాలని సూచించారు.
ఖాసీం రజ్వీలు ఎవరో తెలిసింది..
పదేళ్లు అధికారం అనుభవించి తర్వాత గోడ దూకిన కొందరు అవకాశవాదులు తనపై అనేక తప్పుడు ఆరోపణలు చేశారని అజయ్ తెలిపారు. కబ్జాలు, మట్టిలో కమీషన్లు అంటూ ప్రజలను మభ్యపెట్టారన్నారు. అధికార మార్పిడి జరిగి రెండున్నరేండ్లు అవుతోంది. ఏదైనా ఆగిందా? గుట్టలు నేలమట్టం ఎందుకు అవుతున్నాయి? వెలుగుమట్ల భూ కబ్జాల వెనుక ఉన్నదెవరు? అంటూ ప్రశ్నించారు. వారు తనపై మోపిన నిందల్లో ఏ ఒక్కటైనా నిరూపించారా? అని నిలదీశారు.
అధికారం లేకపోతే బురదమట్టల్లా.. అధికారం ఉంటే తాచుపాముల్లా చెలరేగే వాళ్లు తాను అక్రమాలు, మోసాలకు పాల్పడితే ఊరుకునే వారా? అని కడిగి పారేశారు. ఖమ్మంలో ఎంత మంది ఖాసీం రజ్వీలు ఉన్నారో అనేది ప్రజలకు తెలిసిపోయిందన్నారు. వారు చెప్పినట్లుగా తానే కమీషన్లు తీసుకుంటే అవి తన మమత సంస్థల్లో క్లీనింగ్‌కు కూడా సరిపోవని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో 1/70 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ, గిరిజనుల భూములు ఎలా ఆక్రమించుకున్నారో చెప్పాలని మీడియా సంస్థలు, ప్రజలు నిలదీస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో అవుట్ గోయింగ్ తప్ప ఇన్ కమింగ్ లేని కుటుంబ నేపథ్యం తనది అని మాజీ మంత్రి వెల్లడించారు.
తెలంగాణ సొమ్ముతో కేరళలో ప్రచారం
పాలేరు నుంచి చింతూరు వరకు ఉమ్మడి ఖమ్మంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ విజయమే లక్ష్యంగా పువ్వాడ అజయ్ సైనికులు ఇక నుంచి రంగంలోకి దిగుతారన్నారు. తెలంగాణ సొమ్ముతో సీఎం రేవంత్‌రెడ్డి కేరళలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో రేవంత్ తీరుపై కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయన్నారు. ఓటుకు నోటు కేసులో దొంగ, ఇక్కడకు వచ్చి నీతులు చెబుతాడా? ఖమ్మంలో వెలుగుమట్ల, హైడ్రా పేరుతో హైదరాబాద్‌లో పేదల ఇండ్లు కూల్చే సీఎం రేవంత్ అంటూ చేసిన ట్వీట్‌తో కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యిందన్నారు.
బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నేతలు బచ్చు విజయ్‌కుమార్, ఆర్జేసీ కృష్ణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, ఎర్రా అప్పారావు, కార్పొరేటర్లు మక్బుల్, దండా జ్యోతిరెడ్డి, పల్లా రోజ్లీనా, కూరాకుల వలరాజు, బుర్రి వెంకటేశ్వర్లు, మాటేటి నాగేశ్వరరావు, శీలంశెట్టి వీరభద్రం, వీరూనాయక్, పిన్ని కోటేశ్వరరావు, బత్తుల మురళీప్రసాద్, పోట్ల శ్రీకాంత్, కొప్పెర నర్సింహారావు, షంషుద్దీన్, షేక్ షకీనా, కొంటెముక్కుల వెంకటేశ్వర్లు, పెంట్యా, మూర్తి, మాటేటి కిరణ్‌కుమార్, ధనలక్ష్మి పాల్గొన్నారు.