– పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
– బారుగూడెంలో బీఆర్ఎస్ లో భారీ చేరికలు
ఖమ్మం రూరల్, జనవరి 30 : బీఆర్ఎస్ పాలనలో సబ్బండ వర్గాలు సుభిక్షంగా ఉన్నాయని, కాంగ్రెస్ పాలన రావడంతోనే సమాజంలో అన్ని వర్గాలకు దుర్భిక్షం ఏర్పడిందని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 18వ డివిజన్ బారుగూడెం గ్రామంలో ఆయా పార్టీలకు చెందిన 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు పొన్నెకంటి యాకూబ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
అనంతరం జరిగిన సమావేశంలో సిపిఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ తో కలిసి కందాల మాట్లాడారు. కేసీఆర్ పాలనలో సమాజంలో అన్ని వర్గాలు సుఖసంతోషాలు, సుభిక్షాలతో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కాకముందే యావత్ రాష్ట్రం దుర్భిక్షంగా మారిందని మండిపడ్డారు. ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో అబద్ధాలు, అమలు కాని హామీలతో ప్రజలతో ఓట్లు వేయించుకున్న పాలకుడు పాలేరు ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. నాడు తాను ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో ఏ కుటుంబానికి ఆపద వచ్చినా తానున్నా అనే భరోసా ఇచ్చానని, అంతేకాకుండా నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు.
ముఖ్యంగా బారిగుడంలో రెండు బ్రిడ్జిల నిర్మాణంతో పాటు అనారోగ్యం పాలైన కుటుంబాలకు ఆసరా అయినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో సైతం తన నుండి అదే భరోసా ఉంటుందన్నారు. మున్సిపాలిటీలో 32 వార్డులకు 32 వార్డులు బీఆర్ఎస్, సీపీఎం కూటమి క్లీన్ చిట్ చేయబోతున్నట్లు తెలిపారు. ప్రజలు కూటమి అభ్యర్థులను దీవించి మున్సిపల్ కౌన్సిల్‌కు పంపించాలని కోరారు. రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని, తద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేత పెరుమళ్లపల్లి మోహన్ రావు, పలువురు సీపీఎం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Khammam Rural : ‘బీఆర్ఎస్ అంటే సుభిక్షం.. కాంగ్రెస్ అంటే దుర్భిక్షం’