మధిర/మధిర రూరల్/చింతకాని, అక్టోబర్ 24 : ఖమ్మం జిల్లా చింతకాని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మధిర రూరల్ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి గురువారం ఆందోళనకు దిగారు. మఫ్టీలో ఉన్న వైరా సర్కిల్ పోలీసులు సుమారు ఐదు కార్లలో వచ్చి అయ్యప్ప మాల ధరించిన పుల్లయ్యను చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామంలోని ఆయన ఇంట్లో నుంచి ఎత్తుకొచ్చి తమ వాహనంలో ఎక్కించారు. దీంతో అవాక్కైన ఆయన కుటుంబ సభ్యులు బైఠాయించి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. మహిళలు అని చూడకుండా మఫ్టీలో ఉన్న పోలీసులు వారిని నెట్టి వేశారు. దీంతో పుల్లయ్య ఇంటి వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే వైరా సీఐ నూనావత్ సాగర్, చింతకాని, వైరా ఎస్సైలు, టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో పుల్లయ్యను సర్కిల్ పరిధిలోని పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతూ చివరికి మధిరకు తీసుకొచ్చారు. దీంతో మధిర రూరల్ పోలీస్‌స్టేషన్‌కు పుల్లయ్యను తరలించిన విషయాన్ని తెలుసుకున్న జడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజు.. పార్టీ నాయకులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. అక్రమ అరెస్టును నిరసిస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టడంతోపాటు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పుల్లయ్యను ఎందుకు అరెస్టు చేశారని, మీరు పోలీసులా.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా.. అంటూ ప్రశ్నించారు. శాంతిభద్రతలను పక్కన పెట్టి ప్రతిపక్ష నాయకులనే లక్ష్యంగా చేసుకొని అరెస్టులు చేయడం సరికాదన్నారు. మధిర నియోజకవర్గంలో ఇలాంటి నీచ రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని, సివిల్ డ్రెస్‌లో వచ్చిన పోలీసులు పెంట్యాల పుల్లయ్యను ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని, బేషరతుగా ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కమల్‌రాజు వెంట మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బొగ్గుల భాస్కర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
తన భర్తను అకారణంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో ఆందోళనకు గురైన ఆయన భార్య పెంట్యాల భారతమ్మ ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వెంటనే 108 వాహనంలో ఆమెను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 70 ఏళ్ల వయసు ఉన్న తమ తండ్రి పెంట్యాల పుల్లయ్యను పోలీసులు ఈడ్చుకెళ్తున్నారన్న బాధతో పోలీసులను అడ్డకునే ప్రయత్నం చేయగా.. మహిళలు అని చూడకుండా మఫ్టీలో ఉన్న పోలీసులు తమను నెట్టివేశారని పుల్లయ్య కుమార్తెలు ఆరోపించారు. తమ తండ్రిని ఎందుకు తీసుకెళ్తున్నారని పలుమార్లు అడిగినా సమాధానమివ్వలేదన్నారు.
బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను ఉగ్రవాదిలా పోలీస్స్టేషన్ల చుట్టూ తిప్పుతారా.. అని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు మండిపడ్డారు. మధిరలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతకాని మండలం లచ్చగూడెంలో విద్యుత్ షాక్‌తో ఓ రైతు మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచిన పుల్లయ్యను అక్రమంగా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితో పోలీసు అధికారుల చేత అక్రమ అరెస్టులు చేయించడం సరికాదన్నారు. పుల్లయ్య నేరం చేసి ఉంటే నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి అరెస్టు చేయాలే తప్ప అయ్యప్ప మాలలో ఉండి భిక్ష చేస్తున్న ఆయనను బయటకు లాక్కొచ్చి అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. గత కేసీఆర్ పదేళ్ల పాలనతో పోలీసులు ఉద్యోగ బాధ్యతలు ఇలాగే నిర్వర్తించారా.. అని ప్రశ్నించారు.
వాస్తవాలు పరిశీలించి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా వ్యవహరించాలే తప్ప అక్రమ కేసులు బనాయించే విధంగా వ్యవహరించొద్దన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాయకులకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు చిత్తారు నాగేశ్వరరావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, చావా వేణు, బొగ్గుల వీరారెడ్డి, ఖురేష్, నాగబాబు, అబ్బూరి రామన్, శీలం కృష్ణారెడ్డి పాల్గొన్నారు.