రఘునాథపాలెం, నవంబర్ 18: ఉమ్మడి ఖమ్మం జిల్లా పత్తి రైతులకు బీఆర్ఎస్ బాసటగా నిలిచింది. వారి సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ (ఏఎంసీ)లోని పత్తి యార్డు వద్ద దూదిపూల రైతులతో కలిసి బీఆర్ఎస్ నేతలు మంగళవారం ధర్నాకు దిగారు. పత్తి రైతుల పక్షాన తామున్నామంటూ భరోసా ఇచ్చారు. దళారుల చేతిలో దగా పడాల్సిన పనిలేదని, ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేసే వరకూ తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. రైతులెవరూ అధైర్య పడొద్దనే ధైర్యాన్ని కల్పించారు. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపులో భాగంగా ఖమ్మం పత్తి మార్కెట్‌ను బీఆర్ఎస్ నేతలు మంగళవారం సందర్శించారు. అక్కడి పత్తి రైతులతో మాట్లాడి వారి సమస్యలపై ఆరా తీశారు. అయితే, దళారుల చేతిలో దగా పడుతున్నామని, క్వింటా పత్తిని రూ.6 వేలకు మించి కొనట్లేదని పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి తాము తెచ్చిన పత్తికి కొర్రీలు పెడుతూ తమను నిలువుదోపిడీ చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. జిన్నింగ్ మిల్లుల బంద్ సమాచారాన్ని కూడా సీసీఐ అధికారులు తమకు తెలియజేయకపోవడంతో కిరాయి వాహనాల్లో పత్తిని తెచ్చిన తాము రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహించారు. ఖమ్మం ఏఎంసీ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు మంగళవారం ఖమ్మం ఏఎంసీలో రైతుల కష్టాలను పరిశీలించారు. ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, జడ్పీ, ఖమ్మం ఏఎంసీల మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజు, గుండాల కృష్ణ తదితర నేతలు పత్తి యార్డులో పర్యటించారు. మార్కెట్లో పత్తి కొనుగోళ్ల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
రైతుల కష్టాలను కళ్లారా చూసి వారి వెతలను ప్రత్యక్షంగా తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు కేంద్ర, రాప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో ఖమ్మం పత్తి మార్కెట్ గేటు వద్ద ధర్నాకు దిగారు. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. జిన్నింగ్ మిల్లులు బంద్‌తో జిల్లాలో పత్తి రైతులు పడుతున్న గోడును రాష్ట్ర ప్రభుత్వంగానీ, జిల్లా మంత్రులుగానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కపాస్ కిసాన్ యాప్‌తో సంబంధం లేకుండా జిన్నింగ్ మిల్లులకు తీసుకొచ్చిన రైతుల పత్తిని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో రైతు నుంచి ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తినే మాత్రమే కొంటామనే నిబంధనను ఎత్తి వేయాలని పట్టుబట్టారు. రైతులు ఎన్ని క్వింటాళ్ల పత్తిని తెచ్చినా రూ.8,110 మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతామని స్పష్టం చేశారు. కొర్రీలు లేకుండా పత్తిని కొనేదాకా పోరాటం ఆపేది లేదని తేల్చిచెప్పారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, బెల్లం వేణు, అజ్మీరా వీరూనాయక్, గుత్తా రవి, ఖమర్, తాజుద్దీన్, బలుసు మురళీ, తొట్టి కొమరయ్య, షకీనా, తోడేటి లింగరాజు తదితరులు పాల్గొన్నారు.
సిండికేట్‌గా మారారు.. నిలువు దోపిడీ చేస్తున్నారు..
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతల ఎదుట పత్తి రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అధికారుల అండతో ఖరీదుదారులు, కమీషన్ వ్యాపారులు సిండికేట్‌గా మారి తమను తమను నిలువుదోపిడీ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన పత్తిని తెచ్చినా అనేక కొర్రీలు పెట్టి తమకు అన్యాయం చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మద్దతు ధర లభిస్తుందనే నమ్మకంతో రవాణా ఖర్చులనూ భరించి తమ పంటను మార్కెట్‌కు తెస్తే వ్యాపారులు అతి తక్కువ ధరకు అడుగుతున్నారంటూ కళ్ల చెమర్చారు. పత్తికి రూ.8,110 మద్దతు ధర ఉన్నప్పటికీ ఖమ్మం ఏఎంసీలో రూ.6 వేలకు మించి వ్యాపారులెవరూ కొనుగోలు చేయడం లేదని వాపోయారు.
క్వింటా రూ.6 వేలకు మించి కొంటలేరు..
మా గ్రామంలో ప్రైవేటు వ్యాపారులు క్వింటా పత్తిని రూ.7 వేలకు కొంటామని వచ్చారని నేలకొండపల్లి మండలం రాయిగూడేనికి చెందిన పత్తి రైతు లక్కా లక్ష్మయ్య అన్నాడు. మద్దతు ధర రూ.8,110తో పోల్చితే వారిచ్చే రూ.7 వేల వల్ల రెక్కల కష్టాన్ని నష్టపోతానని భావించినట్లు చెప్పాడు. అందుకని పత్తిని ప్రైవేటు వాహనాన్ని ఎక్కించుకొని ఖమ్మం ఏఎంసీకి తీసుకొచ్చినట్లు చెప్పాడు. అన్ని రవాణా ఖర్చులూ భరించి పత్తిని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడి వ్యాపారులు తన పత్తిని క్వింటాకు రూ.6 వేలకు మించి కొనుగోలు చేయబోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. అదేంటని అడిగితే.. ‘ఇష్టంలేకుంటే ఇంటికి తీసుకెళ్లు’ అంటున్నారని కన్నీటి పర్యంతమయ్యాడు.
-లక్కా లక్ష్మయ్య, పత్తి రైతు, రాయిగూడెం, నేలకొండపల్లి
జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉన్నా నిష్ప్రయోజనం: తాతా మధు, ఎమ్మెల్సీ
సాక్షాత్తూ ఖమ్మం జిల్లా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నా జిల్లా రైతులకు ప్రయోజనం లేకుండాపోయిందని ఎమ్మెల్సీ తాతా మధు విమర్శించారు. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన పత్తి రైతునూ ఆదుకోలేదని దుయ్యబట్టారు. రైతులు ఎన్నో కష్టనష్టాలకోర్చి పత్తి రైతులు తమ పంటను మార్కెట్లకు, సీసీఐ కేంద్రాలకు తెస్తే నిబంధనలు, కొర్రీలు పెట్టి వారిని నిలువునా దోచుకుంటున్నారని మండిపడ్డారు. తేమ, నాణ్యత, స్లాట్ బుకింత్ తదితర నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజులుగా జిన్నింగ్ మిల్లులు బంద్ పాటిస్తూ పత్తి కొనుగోళ్లు చేపట్టని విషయాన్ని రైతులకు ఎందుకు తెలియజేయడం లేదని ప్రశ్నించారు.
గతంలో మద్దతు ధరకు మించి కొనుగోళ్లు: వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ
గత కేసీఆర్ ప్రభుత్వంలో మద్దతు ధరకు మించి పత్తి పంటను వ్యాపారులు కొనుగోలు చేసేవారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యంతో లక్షలాదిమంది పత్తి రైతులు రోడ్డెక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది, కాంగ్రెస్‌కు 8 మంది ఎంపీలు ఉండి కూడా ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. పత్తి రైతుల కష్టాలంటే ఈ ప్రభుత్వాలకు కనీసం కనికరం కూడా కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిన్నింగ్ మిల్లుల యజమానులతో చర్చించి వారి సమస్యలను పరిష్కరించి సీసీఐ కొనుగోళ్లను ప్రారంభించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.