నమస్తే నెట్వర్క్, జూలై 24 : నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై బీజేపీ ప్రభుత్వం లాఠీచార్జి చేయడం దారుణమని, విద్యార్థులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలకు మద్దతుగా శుక్రవారం ఉమ్మడి ఖమ్మంజిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అన్నపురెడ్డి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు దీక్ష చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి మానవహారం నిర్వహించారు. బోనకల్లు మండల కేంద్రంలో భారీ నిరసన ప్రదర్శన చేసి, ధర్నా నిర్వహించారు.

బూర్గంపహాడ్ మండలం సారపాక ప్రధాన కూడలిలో నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరుమలాయపాలెంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఆయా నిరసన కార్యక్రమాల్లో వక్తలు మాట్లాడుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయస్థాయి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించలేకపోవడం బీజేపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. పేపర్ లీకేజీ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
