ఖమ్మం, సెప్టెంబర్ 5 : వరద సహాయం విషయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ అరుణ భర్త, మాజీ కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించడం.. ఇందులో కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోవడంతో మాటామాటా పెరగడంతో నాగేశ్వరరావును ఖమ్మం త్రీటౌన్ పోలీసులు గురువారం స్టేషన్‌కు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న స్థానికులు నాగేశ్వరరావును విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఠాణా ఎదుట ధర్నాకు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి.
నగరంలోని 47వ డివిజన్ పరిధిలోని వరద బాధితులకు బొక్కలగడ్డ వద్ద మున్సిపల్ సిబ్బంది నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో అద్దెకు ఉన్న వారికి కూడా సాయం అందించాలని కోరగా.. కేవలం స్థానికులకు మాత్రమే అందజేయాలని ఉన్నతాధికారులను నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పడంతో నాగేశ్వరరావు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిబ్బందికి, నాగేశ్వరరావుకు మధ్య మాటామాటా పెరగడం, ఇందులోనే కాంగ్రెస్ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
విషయం తెలుసుకున్న త్రీటౌన్ పోలీసులు అక్కడికి వచ్చి నాగేశ్వరరావును జీపులో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు వందలాదిగా మాటేటి కిరణ్ ఆధ్వర్యంలో వెళ్లి త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. దీంతో పోలీసులు, ప్రజలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మాజీ కార్పొరేటర్ తోట వీరభద్రం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని సీఐతో మాట్లాడడంతో నాగేశ్వరరావును విడిచిపెట్టారు. దీంతో స్థానికులు ఆందోళన విరమించారు.