ఖమ్మం, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):తన స్వార్థం కోసం తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ను విమర్శించే అర్హత, స్థాయి లేదని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ విమర్శించారు. మరోసారి వారిపై విమర్శలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.300 కోట్ల నుంచి 3 వేల కోట్లకు ఎలా ఎదిగావని ప్రశ్నించారు.
కేవలం తన రాజకీయ స్వార్థం కోసమే బీఆర్ఎస్ను విమర్శిస్తున్న పొంగులేటి.. వాస్తవాలను మరుగున పెట్టి అబద్ధాలను మాట్లాడుతున్నారని అన్నారు. గడిచిన ఏడేళ్లుగా అనేక వేదికలపై ఆయన కూడా సీఎం కేసీఆర్ నామస్మరణ చేసిన విషయం నిజం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులంతా కేసీఆర్ నామస్మరణ చేస్తున్నారంటూ ఇప్పుడాయన విమర్శిస్తుండడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఏ పార్టీలోనైనా అధినాయుకుడి నామస్మరణ చేయడం సహజమేనని అన్నారు. తెలంగాణలో అభివృద్ధే జరగలేదని పొంగులేటి మాట్లాడుతున్నారని, ఆయన కళ్లున్న కబోదిలా మారారని విమర్శించారు.
2014 తరువాత తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో ఎక్కడా జరుగలేదని అనేక సందర్భాల్లో ప్రసంగించిన విషయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. తన స్వార్థపు కలలను నెరవేర్చుకోవడానికి పొంగులేటి పచ్చి అబద్ధాలను మాట్లాడుతున్నారని అన్నారు. ధరణి పోర్టల్‌పై కూడా పొంగులేటి అవాస్తవాలు మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.
నారాయణపేట, వెంకటాయపాలెం, కొర్లగూడెం, గోపవరం, కాన్కాన్పేటల్లో ఉన్న పొంగులేటికి సంబంధించిన 108 ఎకరాలకు ధరణి ద్వారానే పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన విషయాన్ని మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. 15 నిమిషాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ అయిన చరిత్ర ధరణి రాకముందు దేశంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రూ.50 వేలలోపు పంట రుణాలున్న రైతులందరికీ వడ్డీతో సహా రుణాలను సీఎం కేసీఆర్ మాఫీ చేశారని, ఆపైన రుణాలు ఉన్నవారికి దశల వారీగా రుణమాఫీ చేస్తామని చెప్పారని గుర్తుచేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరున సచివాలయాన్ని నిర్మిస్తే.. కేసీఆర్ గొప్పల కోసమే కడుతున్నారంటూ పొంగులేటి వ్యాఖ్యానించడం సరి కాదని అన్నారు. అయితే అంబేద్కర్ పేరిట కట్టవద్దా అని ప్రశ్నించారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు భవనాలను నిర్మించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో యూనివర్సిటీలు సాధించికున్న వ్యక్తులకు బీఆర్ఎస్లోకి రాకముందే విద్యాసంస్థలు ఉన్న విషయాన్ని పొంగులేటి మరిచిపోతే ఎలా అన్నారు. పెద్ద పెద్ద కంపెనీలను కాదని పొంగులేటికి కాంట్రాక్టులు ఇచ్చినప్పుడు ఇలా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. 15 ఏళ్లయినా సీతారామ ప్రాజెక్టు పూర్తికాదంటున్న పొంగులేటి.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంలో 13వ ప్యాకేజీకి టెండర్ ఎలా వేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ వచ్చాక ఖమ్మం జిల్లాలో భక్తురామదాసు ప్రాజెక్టును పూర్తి చేయడంతోపాటు పాలేరు పాత కాలువ పునరుద్ధరణ పనులను పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. అబద్దాలను ప్రచారం చేస్తూ ఏదో సాధించాలని కలలు గంటున్న పొంగులేటికి ఖమ్మం జిల్లా ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారని అన్నారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ పొంగులేటితో సహచర్యం చేస్తే అతను ఏమిటో తెలుస్తుందని అన్నారు.
ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, ఏ పార్టీలోకి వెళ్లే విషయాన్ని చెప్పలేని స్థితి ఉన్నారని విమర్శించారు. ఉమ్మడి జిల్లాలో ఎస్టీ రిజర్వ్ర్డ్ నియోజకవర్గాల్లో ఆయన ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. వైరాలో తనను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదని స్పష్టం చేశారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఖమర్, కమర్తపు మురళి, డోకుపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.