ఖమ్మం సిటీ, మే 11: పోక్సో కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ ఖమ్మం నగర నాయకులు ప్రశ్నించారు. ఇంతటి తీవ్రమైన నేరంలో నిందితుణ్ని కాపాడేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేసు నమోదులో జాప్యం చేయడం, స్టేషన్ బెయిల్ మంజూరు చేయడం వంటివి చూస్తుంటే.. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం ఏమిటో తేలిపోయిందని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడైన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నగర నాయకులు పగడాల నాగరాజు, ఎస్కే మక్బుల్, బిచ్చాల తిరుమలరావు, మేకల సుగుణారావు, షేక్ షకీనా మాట్లాడారు. బాలికలు లైంగికదాడులను ఎదుర్కొన్న సందర్భంలో వారు ఫిర్యాదు ఇస్తే ఎలాంటి దర్యాప్తు లేకుండా తక్షణమే నిందితుణ్ని అరెస్టు చేయాలంటూ పోక్సో చట్టం చెబుతోందని అన్నారు. మరి బండి భగీరథ్ విషయంలో అలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అతడు కేంద్రమంత్రి కొడుకు కావడం వల్ల, సీఎం రేవంత్‌రెడ్డి అండదండలు పుష్కలంగా ఉండడం వల్లే నిందితుడిని అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారా? అని పోలీసులను ప్రశ్నించారు. ఇదే అఘాయిత్యాన్ని మరొకరు చేసి ఉంటే ఇలాగే వ్యవహరించేవారా? అంటూ నిలదీశారు. దీనికి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలని, ఇలాంటి చట్టాలను కాపాడే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిందితుడిని జైలుకు పంపకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదుట బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీఆర్ఎస్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు కూరాకుల నాగభూషణం, ఎండీవై పాషా, దండా జ్యోతిరెడ్డి, కందాల వీరేందర్, సత్తార్మియా, కోడి వీరబాబు, నన్నెబోయిన చిన్న నాగరాజు, ఉస్మాన్, బలుసు మురళీకృష్ణ, కోడిరెక్కల ప్రాన్సిస్, తీగల సతీశ్‌గౌడ్, పోలెపొంగు వెంకట్, పిట్టల తిరుమల్, దేవరకొండ నాగేశ్వరరావు, మహబూబ్, జావీద్, రమేశ్, ప్రవీణ్, గుంటి రాజు, పిట్టల హరి, మిర్యాల రమేష్, సతీశ్, శివకృష్ణ, దోసపాటి మురళీకృష్ణ, రాధ, విజయ్‌కుమార్, హన్మంతరావు, వెంకట్, లాలు పాల్గొన్నారు.