ఇల్లెందు రూరల్, ఆగస్టు 17 : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తూ.. దాడికి నిరసనగా కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పాత బస్టాండ్ సెంటర్లో శనివారం దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం గూండాగిరిని ప్రోత్సహిస్తూ దాడులకు పాల్పడడం సరికాదన్నారు.
ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అంతలా దాడి జరుగుతుంటే రాష్ట్రంలోని సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడలేదన్నారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కార్యక్రమంలో ఉద్యమ నాయకుడు సిలివేరు సత్యనారాయణ, నాయకులు జబ్బార్, అబ్దుల్ నబి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ భావ్‌సింగ్, డేరంగుల పోషం, ఆదుర్ రవి, రామునాయక్, గిన్నారపు రాజేశ్, హరికృష్ణ, శ్రీను, శివ, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
హరీశ్‌రావు క్యాంపు
అశ్వారావుపేట టౌన్, ఆగస్టు 17 : కాంగ్రెస్ గూండాలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దుయ్యబట్టారు. శనివారం ఆయన తన స్వగృహంలో మాట్లాడుతూ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను అమలు చేయలేక దాడులకు పాల్పడుతోందన్నారు.
గత కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇలాంటి దాడులు జరగలేదని, కాంగ్రెస్ వచ్చిన తర్వాతే దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తోందన్నారు. ఇప్పటికైనా రౌడీ రాజకీయాలను పక్కనపెట్టి ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు. లేదంటే గెలిపించిన ప్రజలే తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. ఇప్పటికే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ఇలాంటి దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు.