పాల్వంచ/ మధిర, ఏప్రిల్ 13: తమ సమస్యలు పరిష్కరించాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. సోమవారంతో అది ఆరో రోజుకు చేరుకుంది. పాల్వంచ కేటీపీఎస్, మధిర డివిజన్ కార్యాలయంలలో ఏర్పాటుచేసిన సమ్మె శిబిరాల్లో కార్మికులు పెద్ద సంఖ్యలో కూర్చొని నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించకపోయినా, హామీలు అమలుచేయపోయినా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. అప్పటి వరకూ విధులను బహిష్కరిస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. కాగా, వీరి సమ్మెకు వివిధ పార్టీల నేతలు సంఘీభావం తెలిపారు.
తమను పర్మినెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఆర్టిజన్లు ఆరో రోజులుగా విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగులు రాకేశ్‌రెడ్డి విమర్శించారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అప్పటి వరకు ఈ సమస్యను ఈ ప్రభత్వం పరిష్కరించకపోతే తమ ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తామని అన్నారు. పాల్వంచ కేటీపీఎస్ ఆవరణలో జరుగుతున్న ఆర్టిజన్ల సమ్మె శిబిరాన్ని సోమవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టిజన్లకు సంఘీభావం తెలిపి మాట్లాడారు.
ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిజన్లు సమ్మె చేస్తుంటే రెండో ముఖ్యమంత్రిగా చెప్పుకునే ఈ ఉమ్మడి జిల్లా మంత్రి, మిగతా మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 23,600 మంది ఆర్టిజన్లు ఆరు రోజులుగా రోడ్డెక్కి సమ్మె చేస్తుంటే ఒక్కరు కూడా వచ్చి కనీసం సమస్యను పరిష్కరిస్తామని హామీ కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. విద్యుత్ ఉద్యోగులు లేకపోతే మన ఇళ్లలో కనీసం బుగ్గ కూడా వెలిగే పరిస్థితి ఉండదని అన్నారు. ఆర్టిజన్ల జేఏసీ నాయకులు పాల్గొన్నారు. కాగా, తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పాల్వంచ కేటీపీఎస్ ఆర్టిజన్లు సోమవారం పాల్వంచ నవభారత్ గెస్ట్ హౌస్‌లో రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే, మధిర డివిజన్ కార్యాలయంలోనూ ఆర్టిజన్లు చేస్తున్న సమ్మె సోమవారానికి ఆరో రోజుకు చేరుకుంది.