ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన విజయవంతమైంది. బుధవారం ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయ భవనం, కంటివెలుగు రెండో దశ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సహా ముగ్గురు సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ హాజరయ్యారు. తొలుత సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని ప్రారంభించి కలెక్టర్ వీపీ గౌతమ్‌ను ఆయన సీట్లో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆరుగురికి కళ్ల పరీక్షలు చేసి కళ్లద్దాలు అందజేశారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఖమ్మం, జనవరి 18 : ఖమ్మం జిల్లాపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వరాల జల్లు కురిపించారు. బుధవారం జిల్లా కేంద్రంలో నూతన కలెక్టరేట్ ప్రారంభం సందర్భంగా భారత రాష్ట్ర సమితి తొలి సభలో ఆయన ప్రసంగిస్తూ ఖమ్మం జిల్లాపై తనకు ఉన్న ప్రేమను మరోమారు చాటుకున్నారు. దీంతో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున సీఎం ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో రూ.58.90 కోట్లు గ్రామాల అభివృద్ధికి కేటాయించినట్లయ్యింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి వేల కోట్ల నిధులు ఇస్తూ మరోమారు రూ.10 లక్షల చొప్పున తన ప్రత్యేక నిధి నుంచి నిధులు మంజూరు చేయడంతో సీఎం కేసీఆర్‌కు గ్రామీణ ప్రజల మీద ఉన్న అభిమానం నిరూపణ అయ్యింది. ఈ నిధులతో గ్రామ పంచాయతీల్లో రోడ్లు, డ్రైన్ల్లు, నిర్మాణమవుతాయి. జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయతీలకు భారీగా నిధులు కేటాయించారు. ఖమ్మంరూరల్ మండలంలోని పెద్దతండా, ఏదులాపురం, కల్లూరు మండల కేంద్రం, తల్లాడ మండల కేంద్రం, నేలకొండపల్లి మండల కేంద్రాల్లో 10వేల జనాభా ఉన్నప్పటికీ మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందకపోవడం వల్ల అభివృద్ధి జరగడం లేదని భావించిన కేసీఆర్ ఒక్కొక్క మేజర్ పంచాయతీకి రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేశారు. దీంతో ఆయా పంచాయతీల్లో సంబురా లు చేసుకున్నారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఖమ్మం నగరం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని, అయినప్పటికీ మరో రూ.50 కోట్లను మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఖమ్మం అభివృద్ధి విషయంలో తుమ్మల ముందుగా ప్రారంభించిన వాటిని పువ్వాడ పూర్తి చేయించడం సంతోషకరమన్నారు.
3 మున్సిపాలిటీలకు రూ.90 కోట్లు
జిల్లాలో ప్రధానమైన మూడు మున్సిపాలిటీలపై నిధుల వర్షం కురిపించారు. మధిర, వైరా, సత్తుపల్లి ముల్సిపాలిటీలకు రూ.30 కోట్ల చొప్పున రూ.90 కోట్లను మంజూరు చేశారు. దీంతో ఆయా మున్సిపాలిటీల రూపురేఖలు మారనున్నాయి. ఈ నిధులతో సీసీ రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్‌లైటింగ్, జంక్షన్ల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి తదితర పనులు చేపట్టే అవకాశం ఉంది. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల లేకపోవడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజాప్రతినిధులు అనేకమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఖమ్మం జిల్లాకు జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ సభలో ప్రకటించారు. దీంతో జిల్లాలోని విద్యార్థులు, తల్లిదండ్రులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తీరనున్న యేండ్ల నాటి కళ..
బ్రిటీష్ కాలంలో మున్నేరు నదిపై కాల్వొడ్డు, నాయుడుపేట మధ్యలో వంతెన నిర్మించి వంద సంవత్సరాలు దాటింది. దీని స్థానంలో కొత్తగా బ్రిడ్జి నిర్మించాలని మంత్రి పువ్వాడ అనేకమార్లు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కేసీఆర్ కొత్త బ్రిడ్జి నిర్మాణానికి హామీ ఇవ్వడంతో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అజయ్‌తోపాటు పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు
ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు.. లక్షలమంది జనం సమక్షంలో సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. ఖమ్మంలో బుధవారం బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ముందుగా.. సాధారణ-మేజర్ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఖమ్మం కార్పొరేషన్‌కు నిధులిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత, ‘ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా..?’ అని సభికులను ప్రశ్నించారు. ఆ వెంటనే, ప్రెస్ గ్యాలరీలో కూర్చున్న విలేకరులు.. “మాకు ఇండ్ల స్థలాలు ఇస్తామని మీరు గతంలో హామీ ఇచ్చారు. కానీ నెరవేర్చలేదు” అని చెప్పారు. వేదిక మీదనున్న సీఎంకు ఇది స్పష్టంగా వినిపించలేదు. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు, రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్ కల్పించుకుని.. “జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కావాలంటున్నారు” అని సీఎంతో చెప్పారు. ఆ వెంటనే సీఎం కేసీఆర్ స్పందించారు. “ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులందరికీ నెల రోజుల్లో ఇండ్ల స్థలాలు ఇస్తాం. ఆ బాధ్యతను రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, అజయ్‌కుమార్‌కు అప్పగిస్తున్నా” అన్నారు. ప్రభుత్వ స్థలం ఉన్నట్లయితే దానిని జర్నలిస్టులకు కేటాయించాలని, లేనట్లయితే ప్రైవేట్ స్థలాన్ని ల్యాండ్ అక్విజేషన్ చేసి స్థలాలు ఇవ్వాలని మంత్రులకు సూచించారు.