వైరాటౌన్, ఫిబ్రవరి 20 : వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. సోమవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ఆధ్వర్యంలో 16మంది కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీఫాంపై కౌన్సిలర్‌గా గెలిచిన జైపాల్ మున్సిపల్ చైర్మన్ అయ్యారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం త్వరలో రూ.30 కోట్ల అభివృద్ధి నిధులు రానున్నాయని, వాటితో మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కౌన్సిలర్లు ఏకతాటిపై ప్రయాణం చేయాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీని ఖమ్మం నగరానికి దీటుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముళ్ళపాటి సీతారాములు, కౌన్సిలర్లు వనమా విశ్వేశ్వరరావు, దారెల్లి కోటయ్య, ధనేకుల వేణు, తడికమళ్ల నాగేశ్వరరావు, నాయకులు ఏదునూరి శ్రీను, మరికంటి శివ, కర్నాటి హనుమంతరావు, కట్టా కృష్ణార్జున్‌రావు, పసుపులేటి మోహన్‌రావు, లగడపాటి ప్రభాకర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్‌ను బర్తరఫ్ చేయాలని వైరా మున్సిపల్ కౌన్సిలర్లు సోమవారం సాయంత్రం కలెక్టర్ వీపీ గౌతమ్‌కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్ బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి చైర్మన్‌గా పదవీ బాధ్యతలు కొనసాగిస్తున్నాడు. ఇటీవల జైపాల్ పార్టీని వీడి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో చేరాడు. ఈ క్రమంలో మున్సిపాలిటీలోని 14 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ ఆధ్వర్యంలో చైర్మన్‌పై ఆవిశ్వాస తీర్మానం పెట్టారు. కౌన్సిలర్లు అందరూ దీనికి అంగీకరించి తీర్మాణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్‌కు అందజేశారు.