భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 24 (నమస్తే తెలంగాణ) : కొత్తగా ఏర్పడిన ‘కొత్తగూడెం కార్పొరేషన్’ మేయర్ పీఠంపై రాజకీయ నేతలు కన్నేశారు. తొలిసారి మేయర్ కుర్చీని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. గతంలో రెండుసార్లు కొత్తగూడెం మున్సిపాలిటీని కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఈసారి కార్పొరేషన్‌పై కూడా గులాబీ జెండా ఎగురవేసేందుకు ఉత్సాహంగా పావులు కదుపుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- సీపీఐ పొత్తుతో ఎమ్మెల్యే సీటు సీపీఐ గెలుచుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సీపీఐ- కాంగ్రెస్ పార్టీలకు పొత్తు లేకపోవడంతో వేర్వేరుగా పోటీ చేశాయి. ఎవరికివారు మాకు గతంకంటే ఎక్కువ స్థానాలు వచ్చాయని సర్దుకుపోయినా.. బీఆర్ఎస్ మాత్రం సొంత బలం నిరూపించుకుని అత్యధిక స్థానాల్లో సత్తాచాటుకుంది.
ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపాలిటీకి కార్పొరేషన్ స్థాయి రావడంతో పాల్వంచ, సుజాతనగర్ ప్రాంతాలు కొత్తగూడెంలో కలిసిపోయాయి. దీంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకోవాలని మూడు ప్రధాన పార్టీలు పోటీపడుతున్నాయి. గతంలో రెండుసార్లు పట్టుసాధించిన మున్సిపాలిటీ పరిధితోపాటు పాల్వంచ, సుజాతనగర్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే ప్రయత్నంలో ఉంది. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావులు పట్టుదలతో గత నెల రోజుల నుంచి సమావేశాలు ఏర్పాటు చేసి అభ్యర్థులను ఎంపిక చేశారు. దీంతో ఆయా డివిజన్లలో బీఆర్ఎస్ ఆశావహులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. గెలుపుపై పూర్తి ధీమాతో ఉన్నారు.
కాంగ్రెస్, సీపీఐ పొత్తు పొసిగేనా?
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్- సీపీఐ పొత్తుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ సీపీఐ కొత్తగూడెం నియోజకవర్గంలో బలం పెంచుకోగలిగింది. దీంతో బలపడిన సీపీఐ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒంటిరి పోరుకు సై అంది. ఈ నేపథ్యంలో తాజాగా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేసేందుకు తహతహలాడుతున్నది. కాంగ్రెస్ కూడా ఒంటరిగా పోటీ చేసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నా వేర్వేరుగా పోటీ చేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువని రాజకీయ విశ్లేషకులు భావిస్తుండటంతో రెండు పార్టీలు పొత్తుల కోసం మంతనాలు చేసుకుంటున్నారు. ఎవరికివారు మాకే బలం ఉందని 60 డివిజన్లలో 30 డివిజన్లు మాకు కావాలంటూ మిత్రపక్షం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దానికి కాంగ్రెస్ ససేమిరా అంటున్నట్లు నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. అధినాయకత్వం మాత్రం పొత్తు ఉండాల్సిందేనని చెప్పడంతో తెరచాటు రాజకీయాలు చేస్తూ రాజీ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చివరికి రెండు పార్టీల మధ్య అవగాహన కుదురుతుందా? లేక ఒంటరిగానే పోటీలోకి దిగుతారా? అనేది వేచిచూడాల్సిందే.
ముందస్తు ప్రచారంలో బీఆర్ఎస్..
పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ ఏరియాల్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరోసారి సత్తా చాటుకోవడం కోసం ముందస్తుగా పావులు కదుపుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసుకుని, కొన్ని ఏరియాల్లో ప్రచారాలు కూడా సాగిస్తున్నది. కాంగ్రెస్ 420 హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. కొత్తగూడెంలో ముగ్గురు ఇతర పార్టీ కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలో ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు.