భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): గొల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నదని షీప్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. కొత్తగూడెంలోని జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొల్ల కురుమలను ఆదుకోవడానికి ప్రభుత్వం రూ.50,001 కోట్లను గొర్రెల పంపిణీ పథకానికి వెచ్చించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,61,896 మంది లబ్ధిదారులు ఉండగా 7,31,595 మంది గొర్రెల పంపిణీకి అర్హులన్నారు. మొదటి దఫాలో మొత్తం 3,93,522 మందికి రూ.50,001 కోట్ల విలువైన గొర్రెల యూనిట్లు అందాయన్నారు. లబ్ధిదారులు యూనిట్లను కాపాడుకుని జీవాల సంతతిని పెంచుకున్నారన్నారు. ఆర్థికాభివృద్ధి సాధించారన్నారు. త్వరలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 11,660 మంది లబ్ధిదారులు ఉండగా మొదటి విడతలో 7,500 మందికి గొర్రెల యూనిట్లు అందాయన్నారు.
రెండోవిడతగా 3,561 మందికి యూనిట్లు అందిస్తామన్నారు. ఇంటి వద్దకే వచ్చి పశువులకు వైద్యం చేసేందుకు ప్రభుత్వం సంచార అంబులెన్స్‌లు ఏర్పాటు చేసిందన్నారు. మూగజీవాలకు సకాలంలో టీకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఈ పథకం విశేష ఆదరణ పొందిందని, దీంతో గొర్రె పిల్లల సంతతి బాగా పెరిగిందని అన్నారు. వికారాబాద్ జిల్లాలో బంటువాడ గ్రామంలో చంద్రయ్యకు 21 గొర్రెలు ఇస్తే అతడి వద్ద ఇప్పుడు 80 గొర్రెలు పెరుగుతున్నాయని గుర్తుచేశారు. దీని వల్ల ఆ కుటుంబానికి రూ.15 లక్షల ఆదాయం సమకూరిందన్నారు. భద్రాద్రి జిల్లాలో 11,660 మంది లబ్ధిదారులకు మొదటి విడతగా 7,500 మందికి గొర్రెలు అందించామని, రెండో విడతగా 3,561 మందికి గొర్రెలు ఇవ్వాల్సి ఉందని అన్నారు. మూగజీవాలకు సేవ చేయడాన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు అదృష్టంగా భావించాలని కోరారు. ఈ సంస్థలో తాను చైర్మన్‌గా పనిచేయడం చాలా గర్వంగా ఉందన్నారు. జిల్లా వైద్యాధికారి పురందర్, సిబ్బంది పాల్గొన్నారు.