వారికి దశాబ్దాలుగా వారసత్వంగా వచ్చిన అసైన్డ్ భూములే ఆధారం. ఏళ్లుగా సాగు చేసుకుంటూ పంటలు పండించుకోవడమే తప్ప కుటుంబ అవసరాలకు ఆ భూమిని అమ్ముకునేందుకు వీలుండదు. బ్యాంకులు లేదా బయటి వ్యక్తులకు తనఖా పెట్టేందుకు అవకాశం ఉండదు. ఒక తరం నుంచి మరో తరం అనుభవించే అవకాశం ఉందే తప్ప పేరు మార్పిడి, బదలాయింపులకు తావే ఉండదు. గత ప్రభుత్వాలు ఏనాడూ అసైన్డ్ భూముల గురించి పట్టించుకోలేదు. అసైన్డ్ రైతుల గోడు విన్న పాపాన పోలేదు. తొలిసారి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అసైన్డ్ భూముల హక్కుల గురించి మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిబంధనలను సడలిస్తామని ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లాకు చెందిన అసైన్డ్ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూములపై పూర్తిస్థాయి హక్కులు వస్తే తమ భూముల విలువ పెరుగుతుందని, అవసరాలకు భూమిని విక్రయించుకోవచ్చని, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా దొరుకుతుందంటున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుకొంటున్నారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో అసైన్డ్ భూములకు సంబంధించిన నిబంధనలను సడలిస్తామని అసైన్డ్ రైతుల్లో కొత్త ఆశలు కల్పించారు. మాకు అసైన్డ్ భూమి కొంత ఉంది. మేము వారసత్వంగా ఒక తరం నుంచి మరో తరం భూమిని అనుభవించడానికి వీలు ఉండేది కానీ, అవసరానికి విక్రయించుకునే వెసులుబాటు ఉండేది కాదు. నిబంధనలు మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని నిబంధనలను సడలిస్తే అసైన్డ్ రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. మా భూముల విలువ కూడా పెరుగుతుంది. మా కుటుంబాలకు ఆర్థిక భరోసా దొరుకుతుంది.
– షేక్ బికారి, రైతు, అంజనాపురం,
అసైన్డ్ భూములపై ఆంక్షల సడలింపు అంశాన్ని బీఆర్ఎస్ ఎన్నికల మ్యాని ఫెస్టోలో చేర్చడంపై దళిత, గిరిజన, బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుం టున్న అసైన్డ్ భూములపై గత ప్రభుత్వాలు సంపూర్ణ హక్కులు కల్పించకపోవడంతో నానా ఇబ్బందులుపడ్డ రైతులకు సీఎం కేసీఆర్ నిర్ణయంతో భరోసా లభించి నైట్లెంది. దీంతో ఉమ్మడి జిల్లా రైతులు హర్షం వ్యక్తం చేయడంతోపాటు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నారు.
– ఖమ్మం, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
అసైన్డ్ భూములున్న రైతుల పాలిట దేవుడు సీఎం కేసీఆర్. అసైన్డ్ భూములకు అన్ని రకాల హక్కులు కల్పించే విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడం మంచి నిర్ణయం. ఇప్పటి వరకు అసైన్డ్ భూమి ఉన్నప్పటికీ అమ్ముకునే హక్కు లేకపోవడంతో ఆ భూములకు విలువ లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయంతో అసైన్డ్ భూములకు ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నది. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– శాకంరెడ్డి పుల్లారెడ్డి, రైతు, కుర్నవల్లి
మాకు ఎకరా అసైన్డ్ భూమి ఉంది. గతంలో ఏ ప్రభుత్వమూ అసైన్డ్ రైతుల గురించి పట్టించుకోలేదు. మా బాధలు వినలేదు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఎవరూ అడగకుండానే అసైన్డ్ రైతుల ఇబ్బందులను పరిష్కరిస్తామని ముందుకు వచ్చారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో అసైన్డ్ భూముల ప్రస్తావన తీసుకొచ్చారు. నిబంధనలను సడలిస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే మా సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.
– నీలకంఠం వెంకటేశ్వర్లు, రైతు, సత్యనారాయణపురం, ఇల్లెందు మండలం
నాకు రెండున్నర ఎకరాల అసైన్మెంట్ భూమి ఉన్నది. ఇద్దరు కుమార్తెలకు పెళ్లి చేసినప్పుడు పసుపు కుంకుమ కింద చెరో అరెకరం రాసిచ్చాను. అది వారు పండించుకొని తినడమే తప్ప అవసరాలకు ఉపయోగపడడం లేదు. దీంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ అసైన్డ్ భూములు బదలాయిస్తామని చెప్పడం చాలా సంతోషకరం. ముఖ్యమంత్రి నిర్ణయం చాలా బాగుంది.
– గరిడేపల్లి రమాదేవి, తాళ్లపెంట, మహిళా రైతు
మాకున్న మూడున్నర ఎకరాల అసైన్డ్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాం. ఎన్నోసార్లు అసైన్డ్ భూముల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేకుండా పోయింది. ఎవరూ గుర్తించని సమస్యను సీఎం కేసీఆర్ ఒక రైతుగా భూమి బదలాయింపు చేస్తామని చెప్పడం చారిత్రాత్మక నిర్ణయం. ఎంతోమంది రైతులకు ఇబ్బందులు తొలగుతాయి.
– కాటేపల్లి కొండలు, రైతు, తాళ్లపెంట
గిరిజన ప్రాంతా ల్లో చాలా మం దికి ప్రభుత్వ భూ ములను పంపిణీ చేశారు. వాటిపై ఎలాంటి హక్కు లు లేవు. విక్రయాలు చేయడం కాదు కదా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పడు సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు. అసైన్డ్ భూముల నిబంధనలపై సడలింపులు చేస్తానని హామీ ఇవ్వడం మంచి పరిణామం. ఒక్కోసారి అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి భూమిని అమ్ముకోవడం తప్పనిసరి అవుతుంది. ఇలాంటి నిర్ణయం చాలా మంచిది.
– భూక్యా సాము, రాజ్తండా, టేకులపల్లి మండలం
అసైన్డ్ భూములను అనుభవించడమే కానీ అమ్ముకునే హక్కు మాకు ఇప్పటివరకు లేదు. ఇకపై అసైన్మెంట్ భూములపై పూర్తి హక్కులు భూ యజమానికి కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఎంతో అభినందనీయం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నప్పటి నుంచి రైతుల పక్షాన నిలిచి అంతా మంచే చేస్తున్నది. అసైన్డ్ భూములపై హక్కులు కల్పిస్తామని పేర్కొనడం ఆనందంగా ఉన్నది. సీఎం కేసీఆర్ హామీతో మా లాంటి రైతులు ఎందరో సంతోషపడుతున్నారు. జీవితాంతం సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– పంచకర్ల సురేశ్, రైతు, అశ్వారావుపేట
అసైన్డ్ భూములకు సంబంధించిన నిబంధనలను సడలిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం మాకెంతో భరోసానిచ్చింది. నిబంధనలు సడలిస్తే అసైన్డ్ రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. భూమి విలువ బాగా పెరుగుతుంది. ఇప్పటివరకు మేము అసైన్డ్ భూమి ఉన్నా అత్యవసర సమయంలో విక్రయించలేకపోయాం. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి అధికారంలోకి వస్తే అసైన్డ్ భూముల సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుందని అసైన్డ్ రైతులంతా విశ్వసిస్తున్నారు.
– పర్సా కృష్ణవేణి, రైతు, సదాశివునిపాలెం, సత్తుపల్లి మండలం
నాకు ఎకరంన్నర భూమి వారసత్వంగా రావడంతో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నా. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో అసైన్డ్ భూముల్లో సాగు చేసుకునే రైతులకు సంబంధించి ఆంక్షలను సడలిస్తామని ప్రకటించడం బాగుంది. ఇది అసైన్డ్ భూములు కలిగిన రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు ధరలు పెరిగే అవకాశం ఉన్నది. కష్టకాలంలో రైతులు భూములు అమ్ముకోవడానికి వెసులుబాటు ఉంటుంది. ఎంతోకాలంగా అసైన్డ్ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో ఎంతో లబ్ధి పొందనున్నారు. దీనిని పూర్తిస్థాయిలో అమలు చేస్తే రైతులు సీఎం కేసీఆర్ ఎప్పటికీ మరువరు.
– గొర్రెముచ్చు వెంకటరమణ, రైతు, నెల్లిపాక, అశ్వాపురం మండలం
సీఎం కేసీఆర్ అసైన్డ్ భూములపై ఒక నిర్ణయం తీసుకుంటాననడం చాలా మంచి పరిణామం. దశాబ్దాల నుంచి వారసత్వంగా తాతలు, తండ్రుల నుంచి అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ వాటిపై ఎలాంటి హక్కులు లేకపోవడం బాధాకరం. హక్కులు లేకపోవడం వల్ల అసైన్డ్ భూములకు మార్కెట్లో సరైన విలువ కూడా లేదు. భూముల పట్టాల విషయంలో ప్రభుత్వం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే అసైన్డ్ రైతులకు మంచి రోజులు వచ్చినట్లే. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో చేర్చిన అసైన్డ్ భూముల అంశంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
– పాలకుర్తి ప్రసాద్, రైతు, పొగళ్లపల్లి, ములకలపల్లి మండలం
అసైన్డ్ భూముల యజమానులకు శాశ్వత పట్టాలు అందజేస్తామని బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చడం ధైర్యాన్నిచ్చింది. 1993 నుంచి భూ అనుభవదారులుగా ఉన్నాం. సర్వే నెంబర్ 94/94లో 120 ఎకరాల భూమి అసైన్డ్ భూమిగా ఉంది. ఇందులో కొందరు గతంలో శాశ్వత పట్టాలు పొందారు. కానీ.. మాకు కాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అయితే సీఎం కేసీఆర్ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ప్రకటన చేయడంతోపాటు పార్టీ ఎన్నికల హామీలో సైతం పొందుపరచడం సంతోషం కలిగించింది. సీఎం కేసీఆర్ ద్వారానే మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.
– గుగులోత్ కృష్ణ, ఆరెకోడుతండా, ఖమ్మం రూరల్
1973లోనే మా నాన్నమ్మ పేరుపై ఎకరం భూమిని ఆనాడు పేళ్ల అప్పిరెడ్డి అనే వ్యక్తి నుంచి ఇచ్చారు. 2011 వరకు ఆ భూమిలో మేమే అనుభవ, పట్టాదారులుగా ఉన్నాం. ఆ తర్వాత ఏమైందోకానీ సదరు భూమి లే అవుట్ చేసినట్లుగా వచ్చింది. పట్టాదారులుగా మేము ఉంటే.. అనుభవదారుల కాలంలో ఇందిరమ్మకాలనీ అనే పేరు వచ్చింది. దీంతో నాటి నుంచి మా గ్రామానికి చెందిన ఆరు కుటుంబాల వ్యక్తులం అధికారుల చుట్టూ తిరిగాం. కానీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. సీఎం కేసీఆర్ ఎట్టకేలకు ఎన్నికల మ్యానిఫెస్టోలో మా సమస్యను చేర్చడం ఎంతో సంతోషాన్నిచ్చింది. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– నారపాటి రమేశ్, ఏదులాపురం, ఖమ్మం రూరల్
మా తాత పొన్నెకంటి యోహాన్కు 30 ఏళ్ల క్రితం ఏదులాపురం రెవెన్యూ పరిధిలో ఎకరం భూమి ఇచ్చారు. పట్టాదారులుగా, అనుభవదారులుగా ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. దీంతో ఉన్న ఎకరం భూమిపై మాకు హక్కు లేకుండా అయ్యింది. తిరిగి సీఎం కేసీఆర్ అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చడం సంతోషంగా ఉంది. మా సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నా.
– పొన్నెకంటి విజయ్, ఏదులాపురం, ఖమ్మం రూరల్
బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన అసైన్ భూముల నిబంధనల విషయంపైనే ఇప్పుడు ఎంతో చర్చ జరగుతున్నది. బీఆర్ఎస్ అధినేత అసైన్డ్ భూముల క్రయ విక్రయాలపై ఆంక్షలు ఎత్తివేస్తామని ప్రకటించడం మాకు ఆనందాన్ని కలిగించింది. నిర్ణయం అమలైతే అసైన్డ్ భూముల కొనుగోళ్లు, అమ్మకాలు పెరిగి భూముల విలువ కూడా పెరుగుతుంది. చిన్నకారు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.
– చాట్ల రాములు, రైతు, సదాశివునిపాలెం, సత్తుపల్లి మండలం
మాకు మూడెకరాల అసైన్డ్ భూమి ఉంది. ఏళ్ల నుంచి మేం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏదైనా ఆపద వచ్చినప్పుడు, శుభాకార్యాలకు, పిల్లల చదువులకు కొంత భూమిని విక్రయిద్దామని అనుకున్నాం. కానీ చట్టాలు, నిబంధనలు అందుకు అనుకూలంగా లేవు. అప్పులు తెచ్చి, వడ్డీలకు వడ్డీలు చెల్లించి నష్టపోయాం. చాలాసార్లు భూమి ఉండి కూడా ఇన్ని బాధలు అనుభవిస్తున్నామని అనుకున్నాం. ఏ పాలకుడూ , ఏ నాయకుడూ మమ్మల్ని పట్టించుకోలేదు. ఇలాంటి సందర్భంలో బీఆర్ఎస్ అధినేత ఎవరూ అడగకుండానే అసైన్డ్ రైతుల సమస్యలకు పరిష్కారం చూపుతామని బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించడం ఆనందాన్నిచ్చింది,
– చేకూరి సత్యనారాయణ, రైతు, ఇల్లెందులపాడు, ఇల్లెందు మండలం