మధిరరూరల్, జనవరి 18 : ఆత్కూరు గ్రామంలో అబ్బూరి సర్కిల్ బోర్డును తొలగించడం హేయమైన చర్య అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. ఆత్కూరు గ్రామంలో అబ్బూరి సర్కిల్‌ను తొలగించిన ప్రదేశాన్ని శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం అబ్బూరి రామకృష్ణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకొని బీఆర్ఎస్ పాలనకు ఆకర్శితులై అబ్బూరి రామకృష్ణ పార్టీలో చేరారన్నారు.
ఆత్కూరు సర్కిల్లో ఆయన పేరుతో ఉన్న బోర్డును అధికారంతో తొలగించినా గ్రామ ప్రజల మనస్సులో ఆయన ఎప్పటికి ఉంటారన్నారు. రాజ్యాంగేతర శక్తులే రాజ్యాన్ని పాలిస్తున్నాయని, రాజ్యాంగ పదవులు లేని వారికి ప్రొటోకాల్ ఎందుకని ఆయన ప్రశ్నించారు. ప్రజలను ఎలా మోసం చేయాలో కాంగ్రెస్ పాలనను చూసి నేర్చుకోవచ్చని, దుమ్ముంటే డిప్యూటీ సీఎం కదిలిరావాలని, ఆయన సొంత ఊరిలో ఎంత మందికి రుణమాఫీ అయ్యిందో చర్చిద్దామన్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అధికారులతో మళ్లీ బోర్డు పెట్టిస్తామని స్పష్టం చేశారు. రిటైర్డు అయినా ఆ అధికారులను వదిలిపెట్టమని, క్యాబినెట్ మినిస్టర్ ఆధ్వర్యంలో అదే సెంటర్‌కు నామకరణం చేయిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.