మామిళ్లగూడెం, జూన్ 10: సభ్యసమాజం తలదించుకునేలా ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు చేసిన లైంగికదాడి, హత్యాయత్నంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ సదరు నిందితుణ్ని కాపాడేందుకు కాంగీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిందితుడు కూడా తమ పార్టీకే చెందిన వాడు కావడంతో ‘చే’యూతనిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇందుకోసం స్వయంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)కి చెందిన అధికార పార్టీ కార్పొరేటర్లు, మరికొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు రంగంలోకి దిగినట్లు విమర్శలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. ఖమ్మంలోని ఓ ప్రాంతానికి చెందిన అపార్ట్మెంట్లో మూడో అంతస్తుపై అదే ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన 57 ఏళ్ల ఎండీ గౌస్ అనే వ్యక్తి ఈ నెల 6న లైంగికదాడికి పాల్పడిన విషయం విదితమే.
లైంగికదాడి అనంతరం ఆ బాలికను అంతమొందించేందుకు మూడో అంతస్తు నుంచి సదరు బాలికను కిందకు తోసేసిన ఘటనలో బాలిక తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతోంది. ఈ విషయాలు ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి రావడం, వివిధ మాధ్యమాల్లో ప్రసారం కావడం కారణాల నేపథ్యంలో పోలీసులు కూడా మంగళవారమే నిందితుడిని రిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడిని రక్షించేందుకు అధికార పార్టీకి చెందిన మాజీ కార్పొరేటర్లు.. పోలీసులపై ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధిత బాలిక కుటుంబంతోనూ మధ్యవర్తిత్వం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బాలికపై అమానుష ఘటనకు పాల్పడిన నిందితుడు గౌస్‌కు రాజకీయ అండదండలతోపాటు ఆర్థికంగా పలుకుబడి ఉంది. దీంతో కేసు నుంచి బయపడేందుకు ప్రయత్నాలు చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితురాలిది పేద కుటుంబం కావడంతో నిందితుడి పక్షం నాయకులు కేసును సాధ్యమైనంత వరకు నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులతోపాటు రియల్ ఎస్టేట్ వ్యాపారులతోనూ సంబంధాలు ఉండడంతో వారితో రాయబారం నెరపి కేసు నుంచి బయట పడేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.
బాధిత బాలిక భవనం పైనుంచి ప్రమాదవశావత్తు పడినట్లు సృష్టించేందుకు అధికార పార్టీ మాజీ కార్పొరేటర్లు రాజకీయ కుట్రలు చేశారు. మెడికో లీగల్ కేసుగా గుర్తించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సిన బాధితురాలిని తొలుత ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పక్కా ప్రణాళికతో మెడికల్ రిపోర్టులను తారుమారు చేసేందుకు ప్రయత్నాలూ చేశారు. దీంతోపాటు ‘రూ.20 లక్షలు ఇస్తాం. సైలెంట్‌గా ఉండాలి. కేసును ఉపసంహరించుకోవాలి’ అంటూ బాధిత కుటుంబంపై కొందరు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తూ బెదిరించే ప్రయత్నం చేసినట్లు విమర్శలున్నాయి.
ఈ అమానుష ఘటన విషయంలో అధికార పార్టీ నేతలు మానవత్వాన్ని మరిచి ఒత్తిళ్లు పెట్టినప్పటికీ ఖమ్మం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత కేసు నమోదు చేయొద్దని, పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడుకుంటామని పోలీసులపై అధికార పార్టీ నేతలు తీవ్రమైన ఒత్తిళ్లు పెంచారు. కానీ, కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు మాత్రం నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు హత్యాయత్నం వంటి కీలకమైన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
బాలికపై లైంగికదాడి, హత్యాయత్నం కేసులో నిందితుడిని శిక్షించాలని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరపాలని బీఆర్ఎస్ సహా సీపీఎం, ఇతర రాజకీయ పక్షాల నేతలు, పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.