పాల్వంచ, ఫిబ్రవరి 1 : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న ప్రస్తుత ఎంపీ నామా నాగేశ్వరరావు గెలుపు కోసం సమష్టిగా పని చేయాలని కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కోరారు. గురువారం పాల్వంచలో బీఆర్ఎస్ నాయకుడు కిలారు నాగేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు, నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేసినా ఓడిపోయిందని, ప్రజలు మార్పు మాత్రమే కోరుకున్నారని, కేసీఆర్‌ను, బీఆర్ఎస్ను వదులుకోలేదన్నారు. నియోజకవర్గంలో దాదాపు రూ.3 వేల కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు తనను ఎందుకు గెలిపించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మధ్యలో ఉంటూ.. అమలు కాని పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌పై పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు.
ఈ నెల 3న కొత్తగూడెంలో నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనున్నదని, ముఖ్య కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, ఎంపీపీ మడి సరస్వతి, జడ్పీటీసీ బరపటి వాసుదేవరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడవల్లి కృష్ణ, మహిపతి రామలింగం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీరాంమూర్తి, విశ్వనాథం, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, డిష్ నాయుడు, ఎస్వీఆర్కే ఆచార్యులు, కొత్వాల సత్యనారాయణ, కాల్వ ప్రకాశ్, దాసరి నాగేశ్వరరావు, కాంపెల్లి కనకేష్, చందూనాయక్, గుర్రం వెంకటరత్నం, సంతోశ్‌గౌడ్, కనగాల బాలకృష్ణ, కొత్తపల్లి సోమయ్య పాల్గొన్నారు.