జూలూరుపాడు, నవంబర్ 17: నియోజకవర్గ ప్రజలందరూ కళ్లముందు జరిగిన అభివృద్ధిని చేసి ఓటు వేయాలని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్‌లాల్ కోరారు. కేవలం ఎన్నికల సమయంలోనే వచ్చి చెప్పే కల్లబొల్లి మాటలకు, ఇచ్చే గ్యారెంటీ హామీలకు మోసపోవద్దని సూచించారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం నిత్యం పనిచేసే వాళ్లను ఎల్లప్పుడూ ఆదరించాలని కోరారు. జూలూరుపాడు మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన..
సాయిరాంతండా, దండుమిట్టతండా, పడమట నర్సాపురం, మాచినేనిపేటతండా, చింతల్‌తండా, కరివారిగూడెం, కొమ్ముగూడెం, గురువాగుతండా, దుబ్బతండా, కాకర్ల, మాచినేనిపేట గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రజలు, మహిళలు ఆయన ఘన స్వాగతం పలికారు. బొట్టుపెట్టి మంగళహారతులిచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిలో తెలంగాణను ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ మాడల్‌ను దేశంలోని అనేక రాష్ర్టాలు అనుసరిస్తున్నాయని అన్నారు.