బోనకల్లు, నవంబర్ 17 : ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేద్దామని బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. గెలిచాక నియోజకవర్గంలో ఉండకుండా ఢిల్లీకి, హైదరాబాద్కు చక్కర్లు కొట్టే కాంగ్రెస్ అభ్యర్థి వద్దని, స్థానికంగా ఉండని అ పార్టీ అభ్యర్థితో అసలు ఏ ప్రయోజనమూ లేదని అన్నారు. తామంతా పగటి వేళల్లో ధైర్యంగా ప్రచారం చేస్తుంటే.. కొందరు మాత్రం రాత్రి వేళల్లో వచ్చి దొంగ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. అలాంటి వారికి బుద్ధిచెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బోనకల్లు మండలంలో శుక్రవారం పర్యటించిన ఆయన.. సీతానాగారం, జానకీపురం, పెద్దబీరవల్లి, చిన్నబీరవల్లి, రామాపురం, నారాయణపురం, రావినూతల గ్రామాల్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని కోరారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ పథకాలను గమనించి ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాని ఆదరించాలని కోరారు. గత ఎన్నికల్లో తాను ఓటమి చెందినప్పటికీ స్థానికంగానే ఉంటూ ఇక్కడి ప్రజల కష్టసుఖాల్లో తోడనీడగా నిలుస్తున్నానని అన్నారు. కానీ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన భట్టి విక్రమార్క మాత్రం తన రాజకీయ స్వార్థం కోసం ఢిల్లీ, హైదరాబాదుల్లోనే ఉంటున్నారని దుయ్యబట్టారు. భట్టి హైటెక్ బస్సులాంటి వాడని, ఎక్కడా ఆగడని విమర్శించారు. తాను మాత్రం పల్లెవెలుగు బస్సు లాంటి వాడినని, చెయ్యెత్తిన ప్రతిచోటా ఆగుతూ ప్రజల బాధలు తెలుసుకుంటూ వెళ్తుంటానని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, మోదుగుల నాగేశ్వరరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, కరివేద సుధాకర్, కొనకంచి నాగరాజు, చిలకా నాగరాజు, కఠారు నాగేశ్వరరావు, తోటకూర అనంతరాములు, కాకాని శ్రీనివాసరావు, సూర్యదేవర సుధాకర్, పేరబత్తిని శాంతయ్య, చెరుకు రామకృష్ణ, నాగేశ్వరరావు, తొండపు వేణు, గుడిపుడి రామకృష్ణ, కొమ్మినేని బాబురావు, బానోత్ కొండా, వేమూరి ప్రసాద్, ముడావత్ సైదా, బోయినపల్లి మాధవరావు, తాళ్లూరి ప్రేమానందం, యనమద్ది శ్రీనివాసరావు, రెడ్డెబోయిన ఉద్దండు, బొమ్మనబోయిన చంద్రం, సయ్యద్ మదార్సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.