ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ఊపందుకున్నాయి.. పార్టీ శ్రేణులు ఉత్సాహంగా సమ్మేళనాలకు హాజరవుతున్నాయి.. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన త్రీటౌన్ స్థాయి సమ్మేళనంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. నేలకొండపల్లి సభలో ఎంపీ నామా, నాగులవంచలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలను వివరించారు. సమావేశాల్లో సమ్మేళనాల జిల్లా సమన్వయకర్త శేరి సుభాశ్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పాల్గొన్నారు. సమావేశాల అనంతరం కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు.
ఖమ్మం, ఏప్రిల్ 9: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, హ్యాట్రిక్ తథ్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని గుర్రం ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన పార్టీ త్రీటౌన్ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి ఐకాన్‌గా మారిందన్నారు. నగరంలో గోళ్లపాడు చానల్‌ను ఆధునీకరించామన్నారు. మురికి కూపంగా ఉన్న 11వ డివిజన్ ప్రజల దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపామన్నారు. చానల్‌పై 10 పారులు ఏర్పాటు చేసి ఆహ్లాదాన్ని పంచుతున్నామన్నారు.
బీఆర్ఎస్ కుటుంబం చాలా పెద్దదన్నారు. కుటుంబ పెద్ద ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమమే పార్టీకి శ్రీరామరక్ష అన్నారు. కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రజలకు విరివిగా చేరవేయాల్సిన బాధ్యత మనపై ఉందని, మనం చేసిన అభివృద్ధిని మనమే చాటి చెప్పాలని కోరారు. అవసరం అయితే డివిజన్ లలో మనం చేసిన అభివృద్దిని వీడియో రూపంలో ప్రదర్శించి ప్రజలకు తెలియచెప్పాలని కోరారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్జేసీ కృష్ణ మాట్టాడుతూ.. అనతి కాలంలోనే మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారన్నారు. మంత్రి కృషితోనే ఖమ్మంలోని త్రీటౌన్ ప్రాంత రూపురేఖలు మారాయన్నారు. రూ.100 కోట్లతో గోళ్లపాడు చానల్‌ను ఆధునీకరించారన్నారు. చానల్‌పై ఆహ్లాదకరంగా పార్క్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు మాట్లాడుతూ.. ఏ సమయంలోనైనా నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే వ్యక్తి మంత్రి పువ్వాడ అజయ్ అని కొనియాడారు.
మంత్రి విజన్‌తోనే హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం నగరం అభివృద్ధి సాధించిందన్నారు. సమ్మేళనంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మ ఏఎంసీ చైర్మన్ దోరెపల్లి శ్వేత, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, కార్యదర్శి మెంతుల శ్రీశైలం, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు కొప్పు నరేశ్‌కుమార్, కార్పొరేటర్లు గజ్జల లక్ష్మి, పసుమర్తి రామ్మోహన్రావు, కన్నం వైష్ణవి, తోట గోవిందమ్మ, అరుణ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి, ధనాల రాధ, మక్కాల కమల, నాయకులు తోట వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, పాలడుగు పాపారావు, ధనాల శ్రీకాంత్, దోన్వాణ్ రవి, రామకృష్ణ, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Khammam1
ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధిద్దాం..
బీఆర్ఎస్ అంటేనే అతిపెద్ద కుటుంబం. కార్యకర్తలే పార్టీ బలగం. అందరం కలిసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో విజయం కోసం పనిచేయాలి. హ్యాట్రిక్ సాధించాలి. ఖమ్మం నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధికి ఐకాన్‌గా మారింది. నగరంలోని గోళ్లపాడు చానల్‌ను రూ.100 కోట్లతో ఆధునీకరించాం. మురికి కూపంగా ఉన్న 11 డివిజన్ల ప్రజల దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపాం. చానల్‌పై 10 పారులు ఏర్పాటు చేసి ఆహ్లాదాన్ని పంచుతున్నాం. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామరక్ష. కార్యకర్తలు, నాయకులకు పార్టీ అండగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి. జరిగిన ప్రగతి వివరించాలి.
– రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
అందరి సంక్షేమం కోసం కేసీఆర్ కృషి..
గొప్ప దార్శనికుడు సీఎం కేసీఆర్. ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని వాటిని కూడా అమలు చేస్తున్నారు. యావత్ దేశమంతా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి అమలు చేయడమే కేసీఆర్ లక్ష్యం. ఆయనతోనే దేశంలో గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. మహాత్మా గాంధీ కలలు నెరవేరతాయి. ప్రజల కలలను సాకారం చేస్తూ ఇప్పటికే కేసీఆర్ తెలంగాణను అభివృద్ధి బాట పట్టించారు. రాష్ర్టానికి జాతిపిత అయ్యారు. నాటి ఉమ్మడి పాలకులు తెలంగాణ వస్తే రాష్ట్రంలో అంధకారం వస్తుందన్నారు. కానీ ఇప్పుడు కరెంట్ కోతలు లేని రాష్ట్రం ఏర్పడింది.
– ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల ఖమ్మం జిల్లా సమన్వయకర్త శేరి సుభాశ్‌రెడ్డి
కార్యకర్తలే బీఆర్ఎస్ బలగం.. బలం
ఖమ్మం నగరం హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి సాధించింది. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీ కి బలం.. బలగం. వచ్చే ఎన్నికల్లో పార్టీకి విజయాన్ని కట్టబెట్టేందుకు సైనికుల్లా పనిచేయాలి. తెలంగాణ అన్నిరంగాల్లో నంబర్ వన్ అని కేంద్రమే స్వయంగా చెబుతున్నది. కానీ రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఇవ్వడం లేదు. ప్రాజెక్ట్‌లకూ మొండిచేయే చూపుతున్నది. మూడేళ్లుగా రాష్ర్టానికి రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు నిలిచిపోయాయి. పైగా టోల్ ట్యాక్స్ పేరుతో ప్రయాణిలకులను దోచుకుంటున్నది. కేంద్రానికి రావాల్సిన వాటాను ముక్కుపిండి తీసుకుంటూ రాష్ర్టానికి పైసా విదిల్చడం లేదు. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని మోదీ ఖమ్మం – దేవరపల్లి జాతీయ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనకు సంబంధిచన ఆహ్వాన పత్రంలో కనీసం నా పేరు లేదు. బీజేపీకి మున్ముందు ప్రజలే బుద్ధి చెప్తారు.
– ఖమ్మం త్రీ టౌన్ ఆత్మీయ సమావేశంలో ఎంపీ నామ నాగేశ్వరరావు
బీఆర్ఎస్ లేకపోతే పొంగులేటికి గుర్తింపే లేదు..
బీఆర్ఎస్ లేకపోతే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గుర్తింపు లేదు. ఉద్యమ నేత కేసీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది పార్టీని వీడిపోయారు. కేసీఆర్‌ను మాత్రం ఏమీ చేయలేకపోయారు. పార్టీని వీడిన వారంతా శంకరగరి మాన్యాలు పట్టారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఖమ్మం రూపురేఖలే మారిపోయాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. జరిగిన అభివృద్ధిని ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించాలి. నిత్యం ప్రజల మధ్య ఉండే వారికి తప్పకుండా గుర్తింపు వస్తుంది. నగర ప్రజలు విజ్ఞత ఉన్నవారు. పనిచేసేవారిని గెలిపిస్తారు. వారి పక్షాన నిలబడతారు. కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలి. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు
పదికి పది స్థానాలను కైవసం చేసుకోవాలి..
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని పది నియోజకవర్గాలను కైవసం చేసుకునేలా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలి. ఇప్పుడు జిల్లాలో పార్టీ మహాశక్తిగా ఎదిగింది. పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఉభయ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీకి స్థానం లేదు. బీఆర్ఎస్కు ఎదురేలేదు. మంత్రి అజయ్‌కుమార్ ఖమ్మం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మంత్రికి అఖండ విజయాన్ని కట్టబెట్టాలి. నిన్నమొన్నటి వరకు పార్టీలో ఉండి ఇప్పుడు మాజీ ఎంపీ పొంగులేటి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం సరికాదు. ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కోరం కనకయ్యకు పార్టీ జడ్పీ చైర్మన్‌గా అవకాశం కల్పించినా స్వార్థంతో మాజీ ఎంపీ పొంగులేటి చెంతకు వెళ్లారు. ఈ పరిణామాలకు మున్ముందు వాళ్లే మూల్యం చెల్లించుకుంటారు.
– రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర