ఖమ్మంరూరల్, ఆగస్టు 20 : ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు(కవలలు) దుర్మరణం చెందారు. మండల పరిధిలోని రామన్నపేట గ్రామానికి చెందిన అత్తునూరి నర్సింహారావు హమాలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
నర్సింహారావు దంపతులకు ఇద్దరు కుమారులు(కవలలు) అత్తునూరి మహేశ్(22), అత్తునూరి నవీన్(22) ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన అన్నదమ్ములు పోటీ పరీక్షలకు ఇంటివద్దనే ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. వీరి స్నేహితుడితో కలిసి ముగ్గురు ఒకే బైక్పై కూసుమంచి వైపు వెళ్తున్నారు. మద్దులపల్లి గ్రామ శివారులోకి చేరుకునే సమయంలో మూలమలుపు వద్ద వెనుక నుంచి వచ్చిన బొలేరో వాహనం బైక్ను బలంగా ఢీకొట్టింది. దీంతో నవీన్, మహేశ్ అక్కడికక్కడే మృతిచెందారు.
మరో యువకుడిని స్థానికులు, పోలీసుల సహాయంతో ఖమ్మం వైద్యశాలకు తరలించి చికిత్స అందజేస్తున్నారు. మహేశ్, నవీన్ మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామారావు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకులు మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.