మద్దతు ధర కల్పిస్తామంటూ, బోనస్ చెల్లిస్తామంటూ గొప్పలు చెప్పిన ప్రభుత్వం.. చివరికి ఆ రెండింటినీ రైతుల చెంతకు చేరకుండా చేస్తోంది. అసలే ఏజెన్సీ ప్రాంతం కావడం.. పంటను మార్కెట్ యార్డుకు తీసుకెళ్లడం దూరాభారంగా మారుతుండడం వంటి కారణాలతో మారుమూల గిరిజన ప్రాంతాల రైతులు తాము చెమటోడ్చి పండించిన పంటను తమ గ్రామాల్లో దళారులకు విక్రయించుకుంటున్నారు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను, బోనస్‌ను కోల్పోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు కూడా దళారులకు కలిసి వస్తున్నాయి. గ్రామాల్లో రైతుల దగ్గర పంటలను సగం ధరకు కొంటున్న దళారులు.. మార్కెట్ వార్డుల్లో వారు మద్దతు ధరకు తిరిగి రైతుల పేర్లనే విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటు మద్దతు ధరను, అటు బోసన్‌ను పొందుతున్నారు. అన్నదాతలు అన్నివిధాలా మోసపోతున్నారు.
-ఇల్లెందు, జనవరి 12
రైతులకు అండగా ఉంటామంటూ, వారు పండించిన పంటలకు మద్దతు ధరలు అందిస్తామంటూ ప్రగల్బాలు పలుకుతూ ప్రకటనలు గుప్పిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరణలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో రెక్కలు ముక్కలు చేసుకుంటున్న రైతన్నలు నిలువునా మునుగుతున్నారు. గ్రామానికో నాలుగు చిల్లర కౌంటర్లు ఏర్పాటుచేసుకుంటున్న దళారులు.. రైతుల వద్ద తక్కువ ధరకే వారి పంటలను కొనుగోలు చేస్తున్నారు. కనీస అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు.. అన్నదాతల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో అటు ప్రభుత్వం పట్టించుకోక, ఇటు అధికారులు అవగాహన కల్పించక చివరికి కర్షకులే తమ కష్టానికి తగిన ఫలితాన్ని కోల్పోతున్నారు. ఫలానా దగ్గరకు వెళ్లి విక్రయిస్తే తాము పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందన్న సమాచారం కూడా మారుమూల గిరిజన ప్రాంతాల రైతులకు చేరడం లేదు. చివరికి సీజన్లకు సీజన్లు పూర్తవుతున్నా రైతులకు మాత్రం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కడం లేదు.
అధికారులను బెదిరిస్తున్న వ్యాపారుల..
మద్దతు ధరలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళం పాడడాన్ని దళారులు తమకు కలిసి వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ఎలాంటి లైసెన్స్‌లు లేకుండానే గ్రామాల్లో చిల్లర కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, అధికార పార్టీ నాయకుల అండదండలతో వీరు ఏకంగా అధికారులను కూడా బెదిరింపులకు గురిచేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడి దళారులకు నిబంధనల ప్రకారం లైసెన్స్ ఉండదు. రైతుల వద్ద పంటను వీరు మద్దతు ధరకు కొనుగోలు చేయరు. కాంటాలు, తూకాలు సక్రమంగా వేయరు. నియమ నిబంధనలను ఏమాత్రమూ పాటించరు. కేవలం రైతులను మోసం చేసేందుకే ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడి దళారుల పంటల కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో సంబంధిత అధికారులు తనిఖీలు చేసినప్పుడు వీరి అక్రమ కొనుగోళ్లు వెలుగు చూస్తే ఏకంగా బెదిరింపులకు దిగుతారు. లేకుంటే అధికార పార్టీ నేలతో ఫోన్లు చేయించి భయబ్రాంతులకు గురిచేస్తుంటారు.
రైతుబంధు రాలేదు.. రుణమాఫీ కాలేదు..
పంటలు చేతికొచ్చాక మద్దతు ధరల విషయంలోనే రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అంతముందు పంటల పెట్టుబడి సాయం విషయంలోనూ అన్నదాతలకు చుక్కలు చూపించింది. సీజన్ మొదట్లోనే రైతుభరోసా పేరిట ఎకరానికి రూ.15 వేల సాయం ఇస్తామంటూ హామీలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తరువాత ఆ వాగ్దానాలను అటకెక్కించింది. మొదట వానకాలం సీజన్లోనూ, తరువాత యాసంగి సీజన్లోనూ రైతుభరోసా అందించలేదు. పైగా అంతకుముందు డిసెంబర్ నాటి రూ.2,500 పంటల పెట్టుబడి సాయాన్నీ పెండింగ్‌లోనే పెట్టింది. అయితే, రైతుభరోసా పేరిట ఎకరానికి రూ.12 వేలు ఇస్తామంటూ, అది కూడా ఈ నెల 26 నుంచి ఇస్తామని చెబుతున్నప్పటికీ ‘అన్ని విడతలవీ కలిపి ఏకమొత్తంగా ఇస్తారా? లేక గడిచిన సీజన్‌ను మాత్రమే ఇస్తారా?’ అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. ఇక రుణమాఫీ విషయంలోనూ రైతులందరినీ నిలువునా దగా చేసింది. కొద్దిమంది రైతులకే మాత్రమే రుణమాఫీని వర్తింపజేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హుల్లో అనేకమందికి రుణమాఫీ చేయనేలేదు. కొందరికి సాంకేతిక కారణాలు చూపినప్పటికీ.. అధికమంది రైతుల రుణాలను మాఫీ చేసిన దాఖలాలు లేవు.
ఇల్లెందు మార్కెట్లో కొనుగోలు చేయాలి..
ఇల్లెందు పట్టణ సమీపంలో మాకు వ్యవసాయ భూమి ఉంది. అందులో సాగు చేసిన పంటలను విక్రయించేందుకు ఇబ్బంది ఎదురవుతోంది. ఎందుకంటే ఈ పంటలను ఇల్లెందు వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు చేయరు. దీంతో పత్తి, మిర్చి పంటలను దూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించాల్సి వస్తోంది. ఈ దూరాభాన్నా భరించలేక నాతోటు ఇక్కడి రైతులు స్థానిక వ్యాపారులకే పంటలను విక్రయిస్తున్నాం. ఇల్లెందు మార్కెట్లో పత్తి, మిర్చి, ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తే మాకు మేలు జరుగుతుంది.
– కే.హరిప్రసాద్, సుదిమళ్ల, ఇల్లెందు
ఈ సంవత్సరం మిర్చి కొనుగోలు చేస్తాం..
రైతులు తాము పండించిన పంటను స్థానిక చిల్లర కౌంటర్ల వద్ద విక్రయించొద్దు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇల్లెందు మార్కెట్ పరిధిలో ఉన్న ఎనిమిది మండలాల్లోని గ్రామాల్లో ఉన్న చిల్లర కౌంటర్లను బంద్ చేయిస్తాం.అనుమతులు లేకుండా కొనుగోలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అలాగే, ఈ సంవత్సరం టేకులపల్లి మార్కెట్ యార్డులో మిర్చి పంటను కొనుగోలు చేస్తాం. లైసెన్స్ ఉన్న వ్యాపారులకే రైతులు తమ పంటలను విక్రయించాలి.
-బానోత్ రాంబాబు, ఇల్లెందు ఏఎంసీ చైర్మన్
మద్దతు ధర అందడం లేదు..
మా ప్రాంతంలో పండించిన పంటలకు మద్దతు ధర ఎంతో ఇక్కడి రైతులు తెలియదు. గ్రామంలో చిల్లర కౌంటర్ల దగ్గరే ఎంతోకొంతకు మా పంటలను అమ్ముకుంటున్నాం. రైతులకు అవగాహన కల్పించి చిల్లర కౌంటర్లను బంద్ చేయించాలి. ఇల్లెందులో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించి రైతులను ఆదుకోవాలి.
– కొంపెల్లి రాములు, రాజీవ్‌నగర్, ఇల్లెందు మండలం