బోనకల్లు, ఏప్రిల్ 18 : ప్రమాదవశాత్తు ఓ బాలుడు బావిలో పడి మృతి చెందిన సంఘటన లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్కి చెందిన షేక్ రేష్మ సంవత్సరం క్రితం ముగ్గురు పిల్లలతో కలిసి చింతకాని మండలం ప్రొద్దుటూరు వచ్చింది. గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద గుడారం వేసుకొని పాత ఇత్తడి సామాగ్రి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె పెద్ద కుమారుడైన షేక్ యాకూబ్ (15) చాపల వేటకని ప్రొద్దుటూరు నుంచి గాళాలు తీసుకుని లక్ష్మీపురం వచ్చాడు.
గ్రామం పక్కనే ఉన్న చెరువు సమీపంలో వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెందాడు. స్థానిక ఎస్ఐ మధుబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు తల్లి రేష్మాకు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్యాల పుల్లయ్య అంతిమ సంస్కారాల కోసం రూ.25 వేలు అందజేశారు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని సొంత గ్రామమైన స్టేషన్ ఘన్పూర్కు తరలించారు.