వేల సంఖ్యలో సాయుధ బలగాలు.. ఎత్తయిన కొండల్లో జల్-జంగల్- జమీన్ నినాదాలు.. ఈ రెండింటి మధ్య 21 రోజుల భీకరపోరు.. ‘ఆపరేషన్ కగార్’ పేరుతో కర్రెగుట్టల్లో మారుమోగిన యుద్ధభేరి.. పచ్చని ప్రకృతి ‘వనం’ లో పారిన నెత్తుటేర్లు.. మావోయిస్టుల ఏరివేతలో చోటుచేసుకున్న పరిణామాలు. తెలంగాణఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులు నిర్విరామంగా కొనసాగిన ‘ఆపరేషన్ కగార్’ తీవ్రరూపం దాల్చి ఆ ప్రాంతాలను దాదాపుగా ఆధీనంలోకి తీసుకుంది. ఈ వివరాలను ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.
– కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 14
తెలంగాణలోని ములుగు జిల్లా, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న దట్టమైన అడవుల్లో ఎత్తయిన కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు తల దాచుకున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఏప్రిల్ 21 నుంచి ఈ నెల 11 వరకు ఆ ప్రాంతంలో ‘ఆపరేషన్ కగార్’ విశ్వరూపం దాల్చిన విషయం విదితమే. 21 రోజులుగా నిర్విరామంగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాలు పైచేయి సాధించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
ఆ రాష్ట్ర డీజీపీ అరుణ్‌దేవ్ గౌతమ్ నిర్దేశం మేరకు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పాటిలింగం నేతృత్వంలో సీఆర్పీఎఫ్ అధికారుల సారథ్యంలో సాగిన ఈ ఆపరేషన్.. విజయవంతమైందని ఆ ఉన్నతాధికారులు వివరించారు. 21 రోజుల్లో కర్రెగుట్టల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 31 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆ 31 మంది మావోయిస్టుల మృతదేహాలతోపాటు 35 క్యాడర్లకు చెందిన ఆయుధాలను స్వాధీనపరుచుకున్నట్లు చెప్పారు.
మృతుల్లో 16 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా వీరిలో పీఎల్జీఏ 1వ నంబర్ బెటాలియన్, తెలంగాణ రాష్ట్ర కమిటీ, దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. మృతుల వివరాలను సేకరిస్తున్నామని, మృతిచెందిన 31 మంది మావోయిస్టుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో సీనియర్ క్యాడర్ మావోయిస్టులు సైతం మృతిచెందడమో లేక గాయపడడమో జరిగిందని భావిస్తున్నామన్నారు.
దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ ఆపరేషన్‌లో మరికొంత మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనపరుచుకోలేకపోయినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఏప్రిల్ 24న జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మృతదేహాలను, మే 5న ఒక మృతదేహాన్ని, మే 7న 22 మృతదేహాలను, మే 8న ఐదు మృతదేహాలను స్వాధీనపరుచున్నట్లు వివరించారు. అదనంగా మావోయిస్టులు సంబంధించిన 216 స్థావరాలతోపాటు బంకర్లను ధ్వంసం చేశామన్నారు.
ఈ సెర్చింగ్ ఆపరేషన్‌లో 450 ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్(ఐఈడీ), 818 బీజీఎల్ షెల్స్, 899 కార్డెక్స్ బండిల్స్, డిటోనేటర్లు, భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనపరుచుకున్నట్లు ధ్రువీకరించారు. మావోయిస్టులకు సంబంధించిన నాలుగు ఆయుధ తయారీ కర్మాగారాలను భద్రతా దళాలు ధ్వంసం చేశాయన్నారు. పెద్ద మొత్తంలో నిత్యావసర సరుకులు, మందులు, రేషన్‌ను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.
ఈ 21 రోజుల ఆపరేషన్‌లో నిమగ్నమైన 18 మంది కోబ్రా, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, జిల్లా రిజర్వు గార్డు విభాగాలకు చెందిన జవాన్లు మందుపాతర పేలిన ఘటనల్లో గాయపడ్డారని, వారికి మెరుగైన చికిత్స అందుతోందని తెలిపారు. 45 డిగ్రీల ఎండలో జరిగిన ఈ ఆపరేషన్‌లో ఎంతోమంది జవాన్లు డీహైడ్రేషన్‌కు గురైనప్పటికీ, పట్టువదలకుండా ఆపరేషన్‌ను విజయవంతం చేశారని పేర్కొన్నారు. 2024 సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఏడాది ‘ఆపరేషన్ కగార్’ మరింత వేగం పుంజుకుందని అన్నారు. గడిచిన 4 నెలల్లో ఇప్పటి వరకు 174 మంది హార్డ్ కోర్ మావోయిస్టు మృతదేహాలను స్వాధీనపరుచుకున్నట్లు చెప్పారు.
ఈ కర్రెగుట్టల్లో జరిగిన ఆపరేషన్ చాలాకాలం వరకు గుర్తుండిపోతుందన్నారు. మావోయిస్టుల దళాలు క్షీణించడంతోపాటు ఆ ప్రాంతాల్లో భద్రతా దళాలు పూర్తిస్థాయిలో పట్టు సాధించాయని తెలిపారు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ రీజియన్, నారాయణ్‌పూర్ జిల్లాలోని మాడ్ రీజియన్‌లో వరుసగా సత్ఫలితాలను సాధించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌తో పట్టు సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. నిర్దేశిత సమయంలోనే మావోయిస్టు పార్టీని పూర్తిస్థాయిలో నిర్మూలించనున్నట్లు తెలిపారు.