సత్తుపల్లి రూరల్, నవంబర్ 3 : తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లకాలంలో ఎవరూ చేయలేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ చేసి చూపారని.. ప్రజారంజక పాలన చూసిన ప్రజలందరూ కేసీఆర్‌ను ఆశీర్వదించి మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని రామానగరంలో ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, మహిళలు, అభిమానులు పెద్దసంఖ్యలో పూలు చల్లి ఎమ్మెల్యే సండ్రకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 2009 ఎన్నికల సమయంలో రామానగరం నుంచే ప్రచారం ప్రారంభించానని.. ఈ ప్రాంతం తనకు సెంటిమెంట్ అని ఏ కార్యక్రమం చేపట్టినా ఇక్కడి నుంచే చేస్తానని మీ అందరికీ తెలుసని వివరిస్తూ తనను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి నియోజకవర్గ ప్రజలు ఆదరించారని…మరోమారు సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ఎన్నికల బరిలో దిగానని… ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో రైతులతో పాటు అన్నివర్గాల ప్రజలకు కేసీఆర్ పాలనలోనే మేలు జరిగిందని అన్నారు.
వచ్చే ఎన్నికల బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు ప్రతినెలా రూ.3వేలు, గ్యాస్ రూ.400లకే, రైతుబీమా తరహాలో ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా రూ.5లక్షలు ఇచ్చేలా రూపొందించారని, పింఛన్లు రూ.6వేలు, రైతులకు రైతుబంధు రూ.16వేలు, రేషన్ లబ్దిదారులకు సన్నబియ్యం అంశాలను మ్యానిఫెస్టోలో చేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే తప్పకుండా వాటిని అమలుచేస్తారని ప్రజలకు వివరించారు. నన్ను గెలిపించండి…ఖచ్చితంగా నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి మేలు జరుగుతుందన్నారు. నియోజకవర్గాన్ని రూ.1000కోట్లతో అభివృద్ధి చేశానని ఓటు అడిగే హక్కు నాకు మాత్రమే ఉందని మీలో ఒకడిగా ఉన్నా కోట్లలో అభివృద్ధి చేశా… నన్ను ఆదరించి ఈసారి ఎన్నికల్లో నాల్గవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ప్రచారంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, సర్పంచ్ వేల్పుల కళావతి, ఎంపీపీ దొడ్డా హైమావతి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, హరికృష్ణారెడ్డి, మట్టా ప్రసాద్, రఫీ, చంటి, వెంకటేశ్వరరావు, రమేష్‌రెడ్డి, కృష్ణమూర్తి, పెద్దిరాజు, దామోదర్‌రెడ్డి, వెంకటరెడ్డి, అప్పారావు, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు.