ఖమ్మం రూరల్, జులై 05 : దేశంలోని ప్రజలను విభజించి పాలించడమే బీజేపీ లక్ష్యమని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్రావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని పల్లెగూడెం పంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామం వద్ద గల ఓ ఫంక్షన్ హాల్లో మండల సీపీఎం శ్రేణులకు రాజకీయ శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని సీనియర్ కామ్రేడ్ గుంతేటి నాగయ్య ఆవిష్కరించారు. పార్టీ మండల కార్యదర్శి ఉరడీ సుదర్శన్ రెడ్డి ప్రిన్సిపాల్ గా వ్యవహరించిన క్లాస్లో నున్నా నాగేశ్వరరావు రాజకీయ తీర్మానం అనే క్లాస్ బోధించారు.
ప్రజలను కులం, మతం, ప్రాంతం పేరుతో విభజించి పబ్బం గడుపుకోవడమే బీజేపీ విధానమన్నారు. ప్రజలు ఇప్పటికైనా కళ్లు తెరిచి రాబోయే ఎన్నికల్లో బీజేపీకి గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. దేశ స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి సంబంధం లేని ఆర్ఎస్ఎస్, జన సంఘ్ నాయకులు నేడు దేశభక్తి వల్లెవేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, చరిత్రను వక్రీకరిస్తూ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నట్లు దుయ్యబట్టారు.
పాలేరు డివిజన్ సీపీఎం కార్యదర్శి బండి రమేశ్ మాట్లాడుతూ.. సీపీఎం కార్యకర్తలు నిరంతరం అధ్యయనం చేస్తూనే పోరాటాలు చేయాలన్నారు. సైద్ధాంతికంగా బలంగా ఉన్నప్పుడే శత్రువుకు సరైన రీతిలో సమాధానం చెప్పగలమన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నండ్ర ప్రసాద్, పొన్నెకంటి సంగయ్య, పి.మోహన్ రావు, నందిగామ కృష్ణ, పెండ్యాల సుమతి, ప్రతాపనేని వెంకటేశ్వర్లు, వడ్లమూడి నాగేశ్వరరావు, డివిజన్ కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శులు, శాఖ సభ్యులు పాల్గొన్నారు.