మధిర, ఏప్రిల్ 08 : భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య స్థిరత్వానికి పునాది కాగా బీజేపీ ప్రభుత్వం దాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్, మధిర నియోజకవర్గం ఇన్చార్జి శ్రావణ్ కుమార్ రెడ్డి అన్నారు. కావునా రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని వారు కోరారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి గార్డెన్స్ లో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ పాలన కొనసాగుతుందన్నారు. రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న మోదీ ప్రభుత్వంపై దేశం వ్యాప్తంగా ప్రజలు తిరుగబడాలన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదంతో ముందడుగు వేస్తోందని తెలిపారు. దేశంలో గత పదేళ్లుగా రాజ్యాంగ విలువలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై ప్రజలు ఒకటిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, మధిర మండలాధ్యక్షుడు సూరంశెట్టి కిశోర్, పట్టణాధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా, జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షుడు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బలా సౌజన్య, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు తుమటి నవీన్ రెడ్డి, మధిర మండల, పట్టణం కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.