భద్రాచలం, జూలై 5: ఆమె నిండు గర్భిణి.. మన ఊరు కాదు.. మన రాష్ట్రం కాదు.. కాన్పు కోసం పొరుగు రాష్ట్రం నుంచి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చింది.. ఆమె కవలలకు జన్మనిస్తున్నదని తెలుసుకుని ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వైద్యులు గర్భిణికి ప్రసవం చేసి తల్లితో పాటు ముగ్గురు శిశువులను కాపాడారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఊసూరు మండలం భట్టిగూడేనికి చెందిన ఊకే పొజ్జా నిండు గర్భిణి. వారు నివసిస్తున్న ప్రాంతంలో సరైన వైద్య సౌకర్యాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఈ నెల 2న భద్రాచలంలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు సాధారణ కాన్పు చేయాలనే ఉద్దేశంతో వైద్యులు రెండు రోజులపాటు ఎదురు చూశారు.
బుధవారం మధ్యాహ్నం ఆమెకు సాధారణ ప్రసవం చేశారు. ప్రసవంలో పొజ్జా ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. వీరిలో ఇద్దరు మగ శిశువులు కాగా ఒక ఆడ శిశువు. పొజ్జాకు గతంలో ఏడు ప్రసవాల్లో ఏడుగురు పిల్లలు పట్టారని, ఎనిమిదో కాన్పులో ఆమె ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిందని ఆసుపత్రి సూపరింటెండెండ్ తెలిపారు. తల్లితోపాటు ముగ్గురు శిశువులను కాపాడిన ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.