 
                                                            కారేపల్లి, నవంబర్ 1: పంటలు దెబ్బతిన్న, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లిఆ మండల పరిధిలోని సూర్య తండ పరిసర గ్రామాలలో శుక్రవారం ఆమె పర్యటించి తుఫాన్‌కు దెబ్బతిన్న వరి, మొక్కజొన్న,మిర్చి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అకాల వర్షం కారణంగా చేతికి వచ్చిన పంట రైతుకు అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంటలను అంచనా వేసి పరిహారం అందించాలన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. తిరిగి పంట వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు సబ్సిడీపై అందించాలని కోరారు.అదేవిధంగా ఈ క్రాప్ ద్వారా ఇన్సూరెన్స్ కూడా అందించాలన్నారు. చాలా మంది రైతులు బ్యాంకు రుణాలు తీసుకుని పంట వేశారనీ నష్టపోవడం వల్ల తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్నారన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమాన్ని పక్కన పెట్టిందనీ ఎద్దేవ చేశారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాగు, తాగునీరు ఇబ్బంది, యూరియా కొరత లేకుండా 10 ఏళ్ల పాటు సుపరిపాలన అందించారని గుర్తుకు చేశారు. తుఫాన్‌తో రైతులు అతులాకుతలం అవుతున్న కేంద్ర,రాష్ట్ర పాలకులు నేటికి స్పందించక పోవటం విచారకరమన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టంపై విచారించి కేంద్రానికి నివేదిక పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు వాసిరెడ్డి రవి,రైతులు బానోతు వీరన్న,విజయ,అశోక్, హాటియా,కోటియా,శ్రీను,చిన్న, రవి,రమేష్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
 
                            