కారేపల్లి, అక్టోబర్ 31: మొంథా తుపాను ప్రభావంతో చేతికొచ్చిన పంటలు దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పరిహారం చెల్లించి ఆదుకోవాలని వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి డిమాండ్ చేశారు. మండలంలోని సూర్యాతండా, పరిసర గ్రామాల్లో తుపాను ప్రభావంతో దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, మిర్చి పంటలను బాధిత రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ చేతికొచ్చిన వరి, మొక్కజొన్క, మిర్చి పంటలు నేలవాలాయని, పత్తి నీటిలోనే తడిసి ముద్ద అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తాత్సారం చేయకుండా ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకుడు వాసిరెడ్డి రవి, రైతులు బానోతు వీరన్న, విజయ, అశోక్, హటియా, కోటియా, శ్రీను, చిన్న, రవి, రమేశ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.