బూర్గంపహాడ్(భద్రాచలం), సెప్టెంబర్ 14: భద్రాచలం గోదావరి నదికి నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. శనివారం నిమజ్జనం జరిగే ప్రదేశాలను ఆయన ఏఎస్పీ అంకిత్‌కుమార్, ఉత్సవకమిటీ నిర్వాహకులతో కలిసి పరిశీలించారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు పూర్తయ్యేలా సహాయ, సహకారాలు అందించాలన్నారు.
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాలు, నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయనున్నట్లు తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణసంచా కాల్చడం వంటివి నిషిద్ధమన్నారు. చట్టానికి విరుద్దంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జిల్లాలో మొత్తం 1537 విగ్రహాలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో భద్రాచలంలో గోదావరిలో నిమజ్జనానికి గణనాథులను తీసుకువస్తారని, ఆ సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరిగేలా కమిటీ బాధ్యులు, ఉత్సవకమిటీల నిర్వాహకులు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై విజయలక్ష్మి, ఉత్సవ కమిటీల నిర్వాహకులు పాకాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.