కొత్తగూడెం క్రైం, అక్టోబర్ 22 : రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా పెట్టడంతోపాటు వారి కదలికలను గమనించాలని, వారిలో మార్పు తీసుకొచ్చే విధంగా ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించాలని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు ఆదేశించారు. ప్రజా వ్యవస్థకు ఆటంకం కలిగించే వారిని గమనించి, వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లాలోని పోలీస్ అధికారులకు నిర్వహించిన నెలవారీ సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. నేరస్తులకు కచ్చితంగా శిక్షపడేలా ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది కృషి చేయాలన్నారు. న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. సైబర్ నేరగాళ్లు ప్రజల బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయం చేస్తున్నారని, వారి నుంచి ప్రజలను చైతన్యవంతులను చేసేలా నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. గంజాయి, మాదక ద్రవ్యాలను రవాణా చేసే వారితోపాటు సేవించే వారిపై సైతం కేసులు నమోదు చేయాలన్నారు. తవిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, వారి కదలికలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం అన్ని పోలీస్స్టేషన్లలో పెండింగ్ కేసుల పురోగతిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో ఫింగర్ ప్రింట్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన చండ్రుగొండ ఎస్సై గంజి స్వప్నను అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు షేక్ అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, సతీశ్‌కుమార్, రవీందర్‌రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, ఇన్స్పెక్టర్లు చెన్నూరి శ్రీనివాస్, మడిపెల్లి నాగరాజు, ఎస్పీ కార్యాలయ ఏవో జయరాజు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.