చండ్రుగొండ, జూన్ 8: మండలంలోని బెండాలపాడు గ్రామ శివారులో ఉన్న కనిగిరి (కనకాద్రి) గుట్టల అటవీ ప్రాంతాన్ని భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజు ఆదివారం పరిశీలించారు. తొలుత బెండాలపాడులోని బ్యాంబూ క్లస్టర్ (వెదురు ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని) సందర్శించి ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కనకాద్రి గుట్టలు ఎక్కారు. వాటి అందాలను, అక్కడి నుంచి కన్పించే అటవీ ప్రాంత రమణీయతను చూసి పరవశించిపోయారు.
కనిగిరి గుట్టలను మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ కితాబిచ్చారు. కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐలు రాయల వెంకటేశ్వర్లు, ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు, చండ్రుగొండ అటవీశాఖ రేంజర్ ఎల్లయ్య, ఫారెస్టు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.