కొత్తగూడెం ప్రగతి మైదాన్, నవంబర్ 14: మాదక ద్రవ్యాల నిర్మూలనపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహించిన ‘చైతన్యం- డ్రగ్స్‌పై యుద్ధం’ కార్యక్రమం శుక్రవారం ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి జిల్లా న్యాయమూర్తి పాటిల్ వసంత్‌కుమార్, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు ముఖ్యతిథులుగా పాల్గొని తమ ప్రసంగంతో ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. తొలుత లక్ష్మీదేవిపల్లి మండలంలోని మార్కెట్‌యార్డులో జడ్జి జెండాను ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి వివిధశాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, వివిధ సంఘాల ప్రజలు భారీ ర్యాలీగా బయలుదేరి సూపర్‌బజార్ సెంటర్ మీదుగా కొత్తగూడెంలోని సింగరేణి ప్రకాశం మైదానంలో ఏర్పాటు చేసిన సభకు చేరుకున్నారు.
‘చైతన్యం-డ్రగ్స్ పై యుద్ధం’ కార్యక్రమంలో భాగంగా కళాశాల, పాఠశాలల విద్యార్థులు వివిధ పాటలు, నాటికలతో ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా సభలో జడ్జి వసంత్‌కుమార్ మాట్లాడుతూ గంజాయి, కొకైన్, హెరైన్ వంటి వివిధ మాదకద్రవ్యాల మత్తులో మునిగి ఎందరో యువత తమ విలువైన జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారన్నారు. ఇలాంటి వారికి చట్టం ఎలాంటి కఠిన శిక్షలను విధిస్తుందో వివరించారు. మత్తు వ్యసనాలకు బానిసలు కాకుండా ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలని సూచించారు. డ్రగ్స్హ్రిత సమాజ నిర్మాణం కోసం న్యాయ వ్యవస్థ పోలీస్‌శాఖకు, ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. నెలరోజులపాటు ఎస్పీ రోహిత్ రాజు సారధ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన పోలీస్‌శాఖతోపాటు ‘చైతన్యం’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, యువతను ప్రత్యేకంగా అభినందించారు.
ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం అనేది వ్యక్తిగత సమస్య కాదని, ఇది సామాజిక రుగ్మత అని, దీనిపై పోలీస్ శాఖతోపాటు ప్రతి పౌరుడు యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో భవిష్యత్తులో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. అనంతరం అందరూ కలిసి మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రతిజ్ఞ చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణగౌడ్, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) గోపతి నరేందర్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్‌సింగ్, జిల్లా రవాణాశాఖ అధికారి వెంకటరమణ, జిల్లా ఆబ్కారి అధికారి ఎస్.జానయ్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత్, డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, రవీందర్‌రెడ్డి, సతీష్‌కుమార్, మల్లయ్య స్వామి, అశోక్, కురసం సత్యనారాయణ, ఇన్స్పెక్టర్లు, విద్యార్థులు, జిల్లా ప్రజలు పాల్గొన్నారు.