సర్కార్ ఆసుపత్రి అంటేనే ఒకప్పుడు జనం భయపడిచచ్చేవారు. నేను సర్కార్ ఆసుపత్రికి రాను తండ్రో అంటూ మొత్తుకునేవారు. అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వంలో తొమ్మిదేండ్లు ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు అధునాతన వైద్య సేవలు అందాయి. పేదలకు పూర్తి నమ్మకం ఏర్పడడంతో వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రులకు ధైర్యంగా క్యూ కట్టారు.
కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. సీన్ రివర్స్ అయ్యింది. మళ్లీ సర్కార్ ఆసుపత్రి పేరు చెబితేనే రోగులు భయపడిచస్తున్నారు. కనీస వైద్యానికి కూడా నోచుకోకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు గుల్లజేసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులకు అందుతున్న అరకొర వైద్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం తేటగా అర్థమవుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ఉన్న జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులు నానా అవస్థలు పడుతున్నారు. పేరుకే పెద్దాసుపత్రి అయినా అక్కడ రోగులకు మందులు ఉండవు. కనీసం ఎక్స్‌రే తీసేవారు ఉండరు. మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి మరింత దుర్భరంగా తయారైంది. సరిపడా వైద్యులు లేకపోవడంతో గర్భిణులు బాగా ఇబ్బంది పడుతున్నారు. కాన్పుల కోసం వచ్చేవారికి ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి లేదా ప్రైవేటుకు వెళ్లండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఉన్నప్పటికీ సరిగా వైద్య సేవలు అందకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి జేబులు గుల్లజేసుకోవాల్సి వస్తున్నదని జిల్లావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మలేరియా, డెంగీ జ్వరాలు విజృంభించడంతో రోగులు ప్రభుత్వాసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఇటువంటి తరుణంలో మందుల కొరత పట్టిపీడిస్తున్నది. కనీసం షుగర్, బీపీ మందులు కూడా లేకపోవడంతో చుక్కలు చూస్తున్నారు. అజిత్రోమైసిన్, పాంటాప్రోజోల్, డైక్లో, ఇతర రోగాలకు అవసరమైన మందులు ఉండకపోవడంతో వైద్యులు బయటకు రాస్తున్నారు.
ప్రతి చిట్టీలో బయట దొరికే మందులు రాయడం పరిపాటైంది. సర్కారు ఆసుపత్రికి సాధారణంగా పేద కుటుంబాలే ఎక్కువగా వస్తుంటాయి. పేదల కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ కనీసం మందులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. జిల్లాలో 29 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు 5, పీపీ యూనిట్ల 5తోపాటు 5 ఏరియా ఆసుపత్రులు, జిల్లాకేంద్రంలో మెడికల్ కాలేజీ అనుబంధంగా జనరల్ ఆసుపత్రి ఉంది. ఏ ఆసుపత్రికి వెళ్లినా మందుల కొరత స్పష్టంగా కనబడుతున్నది.
మాతా, శిశు కేంద్రం విషయానికొస్తే వంద పడకల ఆసుపత్రిలో ఇద్దరే గైనిక్‌లు ఉన్నారు. కాన్పులు చేయలేక గర్భిణులను వేరే ఆసుపత్రులకు రిఫర్ చేయాల్సి వస్తున్నది. దీంతో పేద ఆడబిడ్డలు ‘ప్రైవేటు’ను ఆశ్రయించక తప్పడం లేదు. గతంలో తల్లీబిడ్డ చనిపోయిన ఘటనతోపాటు గర్భిణి బాత్రూంలో డెలివరీ అయిన ఘటనలూ రోగులకు గుర్తుకు రావడంతో మాతా, శిశు కేంద్రానికి రావడం కూడా తగ్గింది. గతంలో ఇచ్చిన ‘కేసీఆర్ కిట్లు’ ఇవ్వకపోగా, న్యూట్రిషన్ కిట్లు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
వెంటిలేటర్లు లేకపోవడంతో సీరియస్ కేసులు వస్తే బయట ఆసుపత్రులకు పంపిస్తున్నారు. మొత్తం 10 వెంటిలేటర్లలో రెండు మాత్రమే పని చేస్తున్నాయి. దీంతో సీరియస్ కేసులు వస్తే ఖమ్మం, వరంగల్‌కు రిఫర్ చేస్తున్నారు. గతంలో ఆక్సిజన్ ప్లాంట్ అందుబాటులో ఉండేది. ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అని మూతపడింది.
కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాయి. ‘కేసీఆర్ కిట్లు’ ఇవ్వడంతో మాతా, శిశు విభాగంలో కాన్పులు ఎక్కువ జరిగాయి. ఇప్పుడు ఏ కిట్లూ ఇవ్వడం లేదు. ఆసుపత్రికి వెళ్తే పట్టించుకునే వారేలేరు. డయాలసిస్ కేంద్రం తెచ్చింది గత కేసీఆర్ ప్రభుత్వంలోనే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆక్సిజన్ లేదు. ఎక్స్‌రేలు పని చేయడం లేదు. మురుగు కాలువ నీరు బయటకు వచ్చి ఆసుపత్రి అంతా దుర్గంధం వెదజల్లుతున్నది.
– వనమా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి, కొత్తగూడెం
ప్రభుత్వాసుపత్రిలో మందుల కొరత లేదు. రోగులే మందులు బయటకు రాయండి అని అడుగుతుంటారు.. తప్ప మేము బయటకు రాయడం లేదు. వెంటిలేటర్ సమస్య ఉన్న మాట వాస్తవమే. రిపేర్ల కోసం పై అధికారులకు తెలియజేశాం. త్వరలో సమస్య పరిష్కారం అవుతుంది. గైనిక్‌లు లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది ఉంది. కాన్పులు బాగానే చేస్తున్నాం.
– డాక్టర్ రాధామోహన్, ఆసుపత్రి సూపరింటెండెంట్
అన్ని మందులు లేవని కాదు. కొన్ని మందులు రాలేదు. వస్తాయి. ఇండెంట్ పెట్టాం. స్టోర్ ఖమ్మంలో ఉంది. ఎవరికొచ్చినా అక్కడ నుంచే రావాలి. రాగానే అన్ని ఆసుపత్రులకు సరఫరా చేస్తాం. యాంటిబయాటిక్స్ రెండు రకాలు ఉన్నాయి. మలేరియా మాత్రలు అందుబాటులో ఉన్నాయి. డెంగీ కేసులు తగ్గాయి. మలేరియా రాకుండా దోమల మందు పిచికారీ చేస్తున్నాం.
పది రోజుల క్రితం పురిటి నొప్పులతో రామవరంలోని మాతా, శిశు కేంద్రానికి వచ్చాను. ప్రసవ సమయానికి మేం చెయ్యలేం.. మా దగ్గర వైద్యులు లేరని చెప్పారు. పెద్ద ప్రాణానికి ఇబ్బంది ఉన్నదని చెప్పారు. వెంటనే ఖమ్మం లేదా వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. గత్యంతరం లేక కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. ప్రసవం కోసం రూ.21 వేలు ఖర్చయ్యాయి. బిడ్డ, నేను క్షేమంగానే ఉన్నాం. మాతా, శిశు కేంద్రంలో వైద్యులు లేనప్పుడు ఆసుపత్రిని ఎందుకు నడిపిస్తున్నారు. మా లాంటి మధ్య తరగతి కుటుంబాల పరిస్థితి ఏమిటి.