పాల్వంచ, డిసెంబర్ 14 : పాల్వంచ పట్టణ పరిధిలోని నవభారత్ పబ్లిక్ పాఠశాల 44వ వార్షిక క్రీడా దినోత్సవ సంబురాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యఅతిథిగా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల, విశిష్టఅతిథిగా ఈ.నరేశ్(ఖోఖో కోచ్ ఇండియన్ రైల్వే టీం), నవ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ ఎల్వీ శరత్‌బాబు, డీజీఎం నవలిమిటెడ్ శంకరయ్య హాజరయ్యారు. ప్రిన్సిపాల్ ఎంవీ శ్రీనివాసరెడ్డి వారికి స్వాగతం పలికారు. సీబీఎస్ఈ క్లస్టర్ లెవల్ అథ్లెటిక్స్ సిల్వర్ మెడలిస్టు బి.కీర్తిశ్రీ రాథోడ్ క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం విద్యార్థులకు అథ్లెటిక్స్ ట్రాక్స్‌పై 15 క్రీడా అంశాల్లో పోటీలు నిర్వహించారు.
పాఠశాల వ్యాయామ శిక్షకులు ఎన్వీ లక్ష్మీ వార్షిక నివేదికను సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో అవధులు లేని అందమైన సమాజానికి దోహదపడే ఆయుధాలు అని అన్నారు. క్రమశిక్షణ, విధేయత విద్యార్థుల ఉన్నతదశకు దోహదపడతాయని, ఆ రీతిగా విద్యార్థులను తయారుచేస్తున్న నవభారత్ యాజమాన్యాన్ని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఉపాధ్యాయలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.